సూత్రధారులను వదిలేసి చిన్నాన్నను అరెస్టు చేశారు: జేసీ పవన్ రెడ్డి

By telugu teamFirst Published Jun 13, 2020, 7:55 AM IST
Highlights

టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని జేసీ పవన్ రెడ్డి ఖండించారు. కక్షపూరితంగానే తన చిన్నాన్న ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారని పవన్ రెడ్డి అన్నారు.

అనంతపురం: జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడాన్ని జేసీ పవన్ రెడ్డి ఖండించారు. జేసీ పవన్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు. చిన్నాను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. 

విచారణను ఎదుర్కునేందుకు తాను పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు జేసి ప్రభాకర్ రెడ్డి ప్రకటించినా కూడా అరెస్టు చేయడం ఏమిటని ఆయన అడిగారు. హాజరవుతానని పలుమార్లు పోలీసులకు చెప్పినా అవసరం లేదని చెప్పి అనారోగ్యంతో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు చేశారని ఆయన అన్నారు.

అసలు సూత్రధారులను వదిలేసి బాధితుడైన తన చిన్నాన్నను అరెస్టు చేయడం రాజకీయ కక్షనే అని ఆయన అన్నారు. తమకు మోసపూరితంగా అమ్మిన అశోక్ లేలాండ్ కంపెనీపై ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని ఆయన అన్నారు. 

అదే విధంగా మధ్యవర్తిత్వం వహింంచిన ముత్తును విచారణ కూడా చేయలేదని, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే విషయం అర్థమవుతోందని పవన్ రెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టుకుండా దుర్మార్గపు పాలన సాగిస్తోందని ఆయన అన్నారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేశారు. వారిద్దరిని అనంతపురం పోలీసులు శనివారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు. 

154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని పోలీసులు అనంతపురానికి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును పోలీసులు ధృవీకరించారు. 

అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు

click me!