కుమారుడు సహా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు

By telugu teamFirst Published Jun 13, 2020, 7:04 AM IST
Highlights

నకిలీ ఎన్వోసీలు సృష్టించిన కేసులో అనంతపురం పోలీసులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్టు చేశారు. హైదరాబాదులో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు.

అనంతపురం: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేశారు. వారిద్దరిని అనంతపురం పోలీసులు శనివారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు. 

154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని పోలీసులు అనంతపురానికి తరలించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును పోలీసులు ధృవీకరించారు. 

అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు. 

బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా రిజిస్ట్రేషన్ చేసి అమ్మకాలు సాగించినట్లు తేలడంతో వారిద్దరిని అరెస్టు చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరపగా నకిలీ పత్రాలు సృష్టించి ఇప్పటి వరకు 154 వాహనాలను నాగాలాండ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు తేలింది. వాటికి సంబంధించిన నకిలీ ఎన్ఓసీ, నకిలీ ఇన్సూరెన్స్ ల కేసుల్లో వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

నకిలీ రిజిస్ట్రేషన్లకు సంబంధింంచి జేసీ ట్రావెల్స్ మీద 24 కేసులు నమోదయ్యాయి. అనంతపురం, తాడిపత్రి పోలీసు స్టేషన్లలో జేసీ ట్రావెల్స్ మీద 27 కేసులు నమోదయ్యాయి.

ఈఎస్ఐ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు శుక్రవారం ఉదయం టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ మర్నాడే శనివారం ఉదయం జేసీ ప్రభాక్ర రెడ్డిని అరెస్టు చేశారు. ఈ రెండు అరెస్టులతో తెలుగుదేశం పార్టీకి పెద్ద దెబ్బ తగిలినట్లే.

click me!