మరోసారి జేసీ వర్సస్ ప్రభాకర్ చౌదరి

By ramya neerukondaFirst Published Sep 5, 2018, 2:29 PM IST
Highlights

ఎమ్మెల్యే వల్ల తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయాయని, రోడ్లు విస్తరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. 

అనంతపురం రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. మొదటి నుంచి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిలు ఉప్పు నిప్పుగా మెలుగుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం కనిపించలేదు. తాజాగా జేసీ మీడియా ఎదుట ప్రభాకర్ చౌదరిపై నిప్పుులు చెరిగారు.

బుధవారం జేసీ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో పోలీసులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ పేరుతో నేరస్తులకు దండంపెట్టి ఎదుట కూర్చోబెట్టుకుంటున్నారని మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అనంతపురం నగరంలో ప్రభుత్వ ఆస్తులు అక్రమార్కుల పాలవుతున్నా పట్టించుకునే అధికారి లేడంటూ తీవ్రంగా ఆరోపించారు. జిల్లా కలెక్టర్, జేసీలకు తాను స్వయంగా ఫిర్యాదు చేసినప్పటికీ తప్పుడు నివేదికలు ఇస్తున్నారన్నారు.

జిల్లాలో పోలీసు వ్యవస్థ గతంలో ఎన్నడూ లేని విధంగా నిర్వీర్యమైపోయిందని, శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని జేసీ ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని ఉద్దేశించి జేసీ అనేక ఆరోపణలు చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే వల్ల తాను అనంతపురంలో ప్లాస్టిక్ వాడకం నిరోధించలేకపోయాయని, రోడ్లు విస్తరించలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసారు. 

ప్రభుత్వ ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా పట్టించుకోని అధికారుల చిట్టాను ఆధారాలతో సహా ముఖ్యమంత్రి ముందుంచుతానని చెప్పారు. ఈ క్రమంలో మీడియాను జేసీ వదిలిపెట్టలేదు. అనంతపురంలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నా మీడియా ప్రతినిధులు కళ్లుమూసుకొని కూర్చున్నారంటూ మండిపడ్డారు.

click me!