సిఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు: వెనక్కి తగ్గిన జెసి

First Published Jun 23, 2018, 8:33 PM IST
Highlights

కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు వెనక్కి తగ్గారు.

విజయవాడ: కడప ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేస్తున్న రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు వెనక్కి తగ్గారు. దీక్షల వల్ల ఉక్కు - తుక్కు ఏదీ రాదని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 

ఆ వ్యాఖ్యలపై దుమారం చెలరేగడంతో జెసి శనివారంనాడు మాట మార్చి వివరణ ఇచ్చారు. దీక్ష చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని మాత్రమే రమేష్ సూచించానని ఆయన చెప్పారు. ఎన్ని దీక్షలు చేసిన ఉపయోగం లేదని అన్నారు.
 
ఉక్కు సమస్య ఉందని అందరికీ తెలియచెప్పడానికే రమేష్ దీక్ష చేస్తున్నారని, ఈ ప్రయత్నంలో రమేష్ ఫలితం సాధిస్తారని ఆయన అన్నారు. దున్నపోతు మీద వానపడ్డట్టుగా ప్రధాని నరేంద్ర మోడీ తీరు ఉందని, ఎన్ని ప్రయత్నాలు చేసిన చేసినా మోదీ స్పందించబోరని, కాబట్టి రమేష్ ఆరోగ్యం పాడుచేసుకోవద్దని చెప్పాను తప్ప ఆయన దీక్ష చేయడం తప్పని తాను ఎక్కడా చెప్పలేదని అన్నారు.
 
ఇదిలావుంటే, ఎంపీ సీఎం రమేష్ ఆమరణ దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం ఉదయం దీక్షా శిబిరంలో ఎంపీ రమేష్, ఎమ్మెల్సీ బిటెక్ రవికి రిమ్స్ వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. రమేష్‌, బీటెక్‌ రవికి షుగర్‌ లెవల్స్‌ తగ్గుతున్నాయని, ఇద్దరూ పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని రిమ్స్‌ వైద్యులు సూచించారు. 

ఆరోగ్యం క్షీణించినా దీక్ష కొనసాగిస్తామని ఎంపీ సీఎం రమేష్‌ తేల్చి చెప్పారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటూ ఈనెల 20వ తేదీన కడపలో ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ రవి ఆమరణ దీక్షకు దిగిన విషయం తెలిసిందే.

click me!