
జంగారెడ్డిగూడెం : పశ్చిమగోదావరి జిల్లా Jangareddygudemలో కల్తీ సారా తాగి చనిపోయారని ఆరోపిస్తున్న మృతుల సంఖ్య 19కి చేరింది. గుంటూరులోని ఆసుపత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ వరదరాజులు అనే వ్యక్తి మృతి చెందారు. వరదరాజులు అవయవాలు ఏవీ పనిచేయకపోవడంతో వైద్యులు చికిత్స చేసినా ఫలితం లేకుండా పోయింది. మరోవైపు బాధిత కుటుంబసభ్యులు జంగారెడ్డిగూడెంలో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. నాటు సారా తాగి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కాగా తమ ఫిర్యాదును తీసుకోవటం లేదని బాధిత కుటుంబసభ్యులు చెబుతున్నారు.
కాగా, పశ్చిమగోదావరి జిల్లా Jangareddygudemలో ఇటీవల చోటు చేసుకున్న వరుస మరణాలపై అధికారులు సోమవారం secretగా విచారణ చేపట్టారు. జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా మృతుల కుటుంబ సభ్యులను టిడిపి అధినేత Chandrababu Naidu సోమవారం పరామర్శించేందుకు వస్తున్న నేపథ్యంలో వారిని ఉదయాన్నే ఏలూరు తీసుకెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. సుమారు 12 కుటుంబాల నుంచి పలువురు సభ్యులను జంగారెడ్డిగూడెం నుంచి తీసుకొచ్చి ఏలూరులోని ఎంపిడిఓ కార్యాలయ సమావేశ మందిరంలో జెసి పి.పద్మావతి, మరికొంత మంది అధికారులు వారి నుంచి వివరాలు సేకరించారు.
ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారితో మాట్లాడారు. ఎవరిని లోపలికి అనుమతించలేదు. బాధిత కుటుంబాలకు మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేయడం గమనార్హం. మధ్యలో కొందరు సమావేశం నుంచి బయటకు వెళ్లారు. విచారణలో దాదాపు అందరూ ఒకే విధమైన సమాధానం ఇచ్చారని తెలిసింది. ‘మీ వాళ్ళు మృతి చెందడానికి కారణం ఏమిటి అని అధికారులు ప్రశ్నించగా.. సారానే అని సమాధానం ఇచ్చాం అని ఓ కుటుంబం తెలిపింది. అనారోగ్య కారణాలతో మృతిచెందారని రాతపూర్వకంగా ఇవ్వాలని అధికారులు వారికి సూచించడంతో… అందుకు వారంతా ఆగ్రహం చెందారని తెలిసింది. ఆ విధంగా వాంగ్మూలాన్ని ఇవ్వలేమని ఖచ్చితంగా చెప్పి బయటకు వచ్చేశారు అని సమాచారం.
ఇదిలా ఉండగా, మార్చి 11న జంగారెడ్డి గూడెంలోని మరణాల మిస్టరీ బయటపడింది. రెండు రోజుల్లో (బుధ, గురువారాల్లో)15 మంది మృతి చెందడం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కలకలం సృష్టించింది. అప్పటి వరకూ ఆరోగ్యంగా ఉన్నవారు ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృత్యువాత పడటం Mysteryగా మారింది. కొందరిలో Vomiting, diarrhea, abdominal pain వంటి లక్షణాలతో ఆస్పత్రిలో చేరడం.. గంటల వ్యవధిలో మృతి చెందడం విషాదం మిగుల్చుతోంది.
వీరిలో ఎక్కువ మందికి Alcohol అలవాటు ఉందని... కల్తీసారా తాగి చనిపోయారని కొందరు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతుల్లో ఒకరిద్దరు 60 నుంచి 70 ఏళ్ల వారు కాగా మిగిలిన వారు నలభై నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్య వయస్కులు. వీరంతా కూలి పనులు, చిన్న వృత్తులు చేసుకునే వారు. వీరిలో కొందరికి కుటుంబసభ్యులు ఆర్ఎంపీలు, పీఎంపీల వద్ద, మరికొందరిని ప్రాంతీయ ఆసుపత్రి, ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చి వైద్యం అందించారు. బుట్టాయగూడెం రోడ్డులోని గాంధీ బొమ్మ సెంటర్ లోని ఓకే వీధిలో ఇద్దరు చనిపోయారు.
‘మా నాన్న ముడిచర్ల అప్పారావు (45) కడుపు నొప్పి.. అంటే ఆర్ఎంపీ వద్ద చూపించాం. తరువాత పట్టణంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకు వెళ్లాం. కొద్దిసేపటికి మా నాన్న చనిపోయారు’ అని ప్రకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాపీ పనులు చేసే బండారు శ్రీనివాసరావు (45) కడుపునొప్పితో బాధపడితే గురువారం ఉదయం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు ఆయన మేనల్లుడు వెంకట తెలిపారు. ‘వాంతులు, విరేచనాలు అయ్యాయి. ఐసీయూలో పెట్టారు. కొద్దిసేపటికే మామయ్య చనిపోయారు అని చెప్పారు’ అని అన్నారు. అత్యధిక మరణాలు ఇదే తీరులో సంభవించినట్లు చెబుతున్నారు.