మండలిలో జనసేన తొలి అడుగు.. ఎమ్మెల్సీగా ధ్రువపత్రం అందుకున్న హరిప్రసాద్

By Galam Venkata Rao  |  First Published Jul 8, 2024, 2:48 PM IST

టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్య, జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ మీడియా హెడ్, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ జూలై 5న నామినేషన్ వేశారు. అయితే, ఇతరులెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘన విజయం సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేటుగా ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఐదు కీలక శాఖలకు మంత్రి అయ్యారు. 

ఎన్నికల నేపథ్యంలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయడంతో ఇటీవల ఉప ఎన్నిక జరిగింది. టీడీపీ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు సి.రామచంద్రయ్య, జనసేన అభ్యర్థిగా ఆ పార్టీ మీడియా హెడ్, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ జూలై 5న నామినేషన్ వేశారు. అయితే, ఇతరులెవ్వరూ నామినేషన్ వేయకపోవడంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సోమవారం వారి ఎన్నికను ఖరారు చేస్తూ రిటర్నింగ్ అధికారి ఎం.విజయ రాజు ధ్రువపత్రం అందజేశారు. వెలగపూడిలోని శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి చేతులమీదుగా హరిప్రసాద్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు. 

Latest Videos

undefined

ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని.... శాసన మండలి సభ్యత్వాన్ని బాధ్యతాయుతమైన పదవిగా భావిస్తున్నానని తెలిపారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, జనసేన, టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. శాసన మండలి తొలి సమావేశాల ప్రారంభానికి సమయం ఉన్నందున కౌన్సిల్ సమావేశాలు, ప్రశ్నోత్తరాలు, చర్చ, భవిష్యత్తులో ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై అధ్యయనం చేయడానికి తనకు ఈ సమయం ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తెలిపారు.

ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ నేపథ్యమిదీ...

ఏలూరుకు చెందిన హరిప్రసాద్ డిగ్రీ వరకు అక్కడే చదివారు.. విజయవాడ సిద్ధార్థ న్యాయ కళాశాలలో బి.ఎల్. పూర్తిచేశారు. లా చదివినప్పటికీ జర్నలిజం వృత్తిని ఎంచుకున్నారు. ప్రింట్& ఎలక్ట్రానిక్ రంగంలో విశేషానుభవం ఉంది. సుమారు పాతికేళ్లపాటు మీడియా రంగంలో ఉన్నత స్థానాల్లో పనిచేశారు. ఈనాడు & ఈటీవీలో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆ తర్వాత పలు టీవీ ఛానెళ్లలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. జనసేన ఆవిర్భావం తరువాత ఆ పార్టీ మీడియా హెడ్‌గా, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు.

click me!