పాలవెల్లువ కాదు పాపాల వెల్లువ.. అమూల్, వైసీపీ నేతల కోసమే ఆ స్కీమ్ : నాదెండ్ల మనోహర్ ఆరోపణలు

Siva Kodati |  
Published : Nov 11, 2023, 09:24 PM IST
పాలవెల్లువ కాదు పాపాల వెల్లువ.. అమూల్, వైసీపీ నేతల కోసమే ఆ స్కీమ్ : నాదెండ్ల మనోహర్ ఆరోపణలు

సారాంశం

పాలవెల్లి పథకం పాపాల వెల్లువ అని.. ఈ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని చెబితే మంత్రి స్పందించడానికి ఇన్ని రోజులు పట్టిందా అని  జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల వెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం , అమూల్ డైరీ కోసమే కోసమే బటన్ నొక్కారని నాదెండ్ల ఆరోపించారు.

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని ఎండగడుతూ స్పష్టమైన ప్రశ్నలతో ముందుకు వెళ్తుంటే ప్రభుత్వం ఎదురు దాడి చేస్తుందని మండిపడ్డారు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పథకాలు నిజాయితీగా నేరుగా అంతిమంగా ప్రజలకు అందాలనేదే మా పోరాటమన్నారు. పాలవెల్లి పథకం పాపాల వెల్లువ అని.. ఈ స్కీమ్‌లో స్కామ్ జరిగిందని చెబితే మంత్రి స్పందించడానికి ఇన్ని రోజులు పట్టిందా అని నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కోట్లు పెట్టి పథకాలు తెచ్చినప్పుడు రాష్ట్రంలో పాల ఉత్పత్తి ఎందుకు పెరగలేదని ఆయన ప్రశ్నించారు. పాల వెల్లువ పథకం వైసీపీ నాయకుల కోసం , అమూల్ డైరీ కోసమే కోసమే బటన్ నొక్కారని నాదెండ్ల ఆరోపించారు. పథకంలో వేల కోట్లు అవినీతి జరిగిందని.. ఆ డబ్బులు అన్ని ఎటుపోయాయో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మీ శాఖ మీద జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడాలని.. ఈ మంత్రి మీదే మరో అంబులెన్స్ స్కాం బయట పెడతాముని దాని సిద్దంగా ఉండాలంటూ మనోహర్ చురకలంటించారు. 

మీ శాఖ ద్వారా ప్రజాధనం నష్టం జరుగుతుంటే మీకు బాధ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న స్కాంలు ఆధారాలతో సహా బయటపెడతామని నాదెండ్ల పేర్కొన్నారు. పశువుల కొనుగోలు విషయంలో ఒక మంత్రి 2,08,790 పశువులు కొనుగోలు చేసామని చెప్తే .. మరో మంత్రి 3,94,000 పశువులు కొన్నామని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సాక్షాత్తూ శాసనసభలో 3,92,911 పశువులు కొనుగోలు చేశామని మరో అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

క్లాస్ వార్ అని  ప్రగల్బాలు పలికే ప్రభుత్వం ప్రజలను మోసం  చేస్తూ పాలన సాగిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి స్కామ్ గురించి ఎండగడుతూ స్పష్టమైన ఆధారాలతో ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు న్యాయం చేయడమే జనసేన లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని పాడి పరిశ్రమ పట్ల మంత్రులు తమకు తోచిన విధంగా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని హితవు పలికారు. అధికారులు చెప్పిన లెక్కలకు మంత్రులు చెప్పే లెక్కలకు పొంతన  లేదని.. పాడి పరిశ్రమ ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రోత్సహిస్తున్నామని ప్రగల్బాలు పలికే రాష్ట్ర ప్రభుత్వం వారిని నమ్మించి మోసం చేసిందని నాదెండ్ల దుయ్యబట్టారు. 

అమూల్‌కి 22 లక్షల లీటర్లు అందిస్తామని గతంలో ఒక మంత్రి చెబితే  నేడు మరో మంత్రి అమూల్ కోసం రెండు లక్షల 75 వేల పాల సేకరణ జరుగుతుందని చెప్పడం విడ్డూరమన్నారు. శాఖలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడకుండా మరో విషయం గురించి మాట్లాడుతూ అసలు అంశాన్ని పక్కదోవ పట్టిస్తున్నారన్నారని మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం హయాంలో నాలుగేళ్లలో గుజరాత్, హర్యానా నుండి పశువులు కొనుగోలుకి అనుమతులు ఇచ్చినా 50,000 దాటని పరిస్థితి ఉందని ఆయన గుర్తుచేశారు.

క్షేత్రస్థాయిలో పశువులు 8000 మాత్రమే ఉన్నాయని అధికారులు చెప్తుంటే  వాటి పట్ల మంత్రులు సమాధానం ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు. నవంబర్ 14 నుండి ప్రతిరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవినీతి స్కాం గురించి జనసేన బయటపెడుతుందని దానికి సిద్దంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్