జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనకు ఏపీ రోడ్లు భవనాల శాఖ అనుమతి మంజూరు చేయకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ళ వల్లనే అనుమతి ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
రేపటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన వాయిదా పడింది. పవన్ హెలిప్యాడ్‌కు ఏపీ రోడ్లు భవనాల శాఖ అనుమతి మంజూరు చేయకపోవడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. పవన్ కల్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం భీమవరం విష్ణు కాలేజీలో హెలిపాడ్ కోసం పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌కి దరఖాస్తు చేసింది జనసేన. దీనిపై కలెక్టర్, పోలీసు శాఖ అధికారులు సానుకూలంగా స్పందించారని జనసేన నేతలు అంటున్నారు.
అయితే ఆర్ అండ్ బి శాఖ అధికారులు దూరంగా ఉన్న భవనాలను సాకుగా చూపించి హెలిప్యాడ్‌కు అనుమతి నిరాకరిస్తున్నరని జనసేన పార్టీ నేతలు భగ్గుమంటున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్ల వల్లనే అనుమతి ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కోసం హెలిప్యాడ్‌కు ఎలా అనుమతి ఇచ్చారని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికీ హెలిప్యాడ్ ప్రాంగణంలో ఎలాంటి మార్పులు లేకపోయినా పవన్‌కు అభ్యంతరాలు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాగా.. బుధవారం నుంచి పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించున్నారు. ఫిబ్రవరి 14 నుంచి 17 వరకు ఆయన పర్యటనలు సాగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేయాలని భావిస్తోన్న పవన్.. ఇందుకోసం ప్రత్యేక హెలికాఫ్టర్‌ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో హెలిప్యాడ్లకు అనువైన ప్రదేశాలను ఆ పార్టీ నేతలు పరిశీలించే పనిలో వున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ భీమవరానికి రానున్నారు. ఇప్పటికే స్థానిక నేతలు భీమవరంలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు దీనికి ఆర్ అండ్ బీ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో జనసేన పార్టీ నేతలు భగ్గుమంటున్నారు.