భర్త ఎవరో తెలియని దుస్థితికి మహిళల్ని దిగజార్చి...: తిరుపతి పోలింగ్ పై నాదెండ్ల సంచలనం

By Arun Kumar PFirst Published Apr 18, 2021, 7:34 AM IST
Highlights

తిరుపతి ఉపఎన్నికల్లో భాగంగా శనివారం జరిగిన పోలింగ్ లో వైసీపీ ఆర్గనైజ్డ్ రిగ్గింగుకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేసిందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో ఉన్నతాధికారులు, పోలీసులు, పోలింగ్ సిబ్బంది సహకారంతో వైసీపీ ఆర్గనైజ్డ్ రిగ్గింగుకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని నడిబజారులో ఖూనీ చేసిందని జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  వందల టూరిస్ట్ బస్సుల్లో తిరుపతి పార్లమెంట్ కు సంబంధం లేని నియోజకవర్గాల నుంచి, పొరుగు జిల్లాల నుంచి మనుషులను తోలుకువచ్చి ఉదయం నుంచి దొంగ ఓట్లు వేయించడం మొదలుపెట్టారని ఆరోపించారు. అసలు ఓటర్లు వచ్చి ఓటు వేద్దామనుకొంటే అప్పటికే వేసి ఉండటం అత్యంత దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేశారు. 

''విధుల్లో ఉన్న అధికారులు తమ కళ్ల ముందే దొంగ ఓట్లు పోలవుతుంటే చోద్యం చూశారు. ఉదయం నుంచి బీజేపీ, జనసేన నాయకులు వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల అధ్వర్యంలో సాగుతున్న ఈ అరాచకం గురించి అధికారులకు చెబుతున్నా... మీడియా ఈ ఆర్గనైజ్డ్ రిగ్గింగ్ గురించి చూపిస్తున్నా రాష్ట్ర ఎన్నికల అధికారి, రిటర్నింగ్ అధికారి స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికారులు కళ్లున్న గుడ్డివారిలా నటిస్తే ప్రజాస్వామ్యం మనజాలదు. ఈ తిరుపతి ఉప ఎన్నిక జరిగిన రోజు ప్రజాస్వామ్యానికి దుర్దినం. ఇన్నేళ్లల్లో ఇంతటి అవకతవకలతో కూడిన దౌర్జన్యపూరితమైన ఎన్నికను ఎప్పుడూ చూడలేదు'' అని నాదెండ్ల ఆరోపించారు.

read more  ఓట్లు వేసినోళ్లంతా రౌడీలు, గుండాలే... తిరుపతి జనాలు కాదు: రత్నప్రభ ఆరోపణలు

''తిరుపతి ఉప ఎన్నిక కోసం దొంగ ఓటర్ ఐ.డి కార్డులు ముద్రించి ఎక్కడెక్కడి నుంచో జనాన్ని తోలుకువచ్చి క్యూలో నిలబెట్టారు. అలాంటి ఓటరుని మీ తండ్రి పేరు ఏమిటని అడిగితే చెప్పలేకపోయారు. ఓ మహిళను నీ భర్త పేరు ఏమిటని అడిగితే తడబడ్డారు. తండ్రి, భర్త ఎవరో తెలియని దుస్థితికి కూలికి వచ్చిన దొంగ ఓటర్లకు కల్పించారు ఈ వైసీపీ నేతలు. ఇలా దొంగ ఓట్లు వేయించడం కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగం అనుకోవాలా?'' అంటూ ఎద్దేవా చేశారు.

''ఎన్నికల ముందు దేశం అంతా తలతిప్పి చూసేలా చేస్తాం అన్నారు... అంటే ఈ విధమైన దౌర్జన్యం గురించేనా మీరు చెప్పింది? ఓటమి భయంతోనే ముందు నుంచి నేరపూరిత, ఫ్యాక్షన్ ఆలోచనలతో దొంగ ఓట్లు వేయించే కార్యక్రమం చేపట్టారు'' అని అన్నారు.

''తిరుపతి ఉప ఎన్నికను తక్షణం రద్దు చేసి మళ్ళీ ఎన్నికల ప్రక్రియను చేపట్టాలి. ఇప్పుడు ఎన్నికల విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారి నుంచి పోలింగ్ సిబ్బంది వరకూ అందరినీ దూరంపెట్టి పారదర్శకంగా రీ పోలింగ్ నిర్వహించాలి. వందల బస్సుల్లో రిగ్గింగ్ చేసేందుకు జనాన్ని తరలించడంలోను, దొంగ ఓట్లు పోలయ్యేందుకు సహకరించిన సిబ్బందిపైనా, ఎన్నికల అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసినవారిని, వేసేందుకు ప్రయత్నించినవారిని వీడియోల ద్వారా గుర్తించి తక్షణమే అరెస్టు చేయాలి'' అని నాదెండ్ల డిమాండ్ చేశారు.

 

click me!