ఏపీ రాజకీయాల్లో కలకలం : కన్నా లక్ష్మీనారాయణతో నాదెండ్ల మనోహర్ భేటీ... ఏం జరుగుతోంది..?

By Siva KodatiFirst Published Dec 14, 2022, 8:57 PM IST
Highlights

బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. వీరిద్దరి సమావేశం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కన్నా జనసేనలో చేరుతారా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. 
 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో జనసేన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ భేటీ అయ్యారు. బుధవారం గుంటూరులోని ఆయన ఇంటికి వెళ్లిన నాదెండ్ల పలు అంశాలపై దాదాపు 45 నిమిషాల పాటు చర్చించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అధికార వైసీపీని గద్దె దించేందుకు సీనియర్ నేతలతో భేటీ అవుతున్నట్లు తెలిపారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై తమ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడతారని నాదెండ్ల చెప్పారు. గతంలో కాంగ్రెస్‌లో వున్నప్పుడు ఆయనతో వున్న అనుబంధంతోనే కన్నాను కలిసినట్లు మనోహర్ పేర్కొన్నారు. 

కాగా.. కొంతకాలంగా వీర్రాజు వ్యవహారశైలిపై కన్నా లక్ష్మీనారాయణ గుర్రుగా వున్నారు. పలువురు నేతలు కూడా అసహనంతో వున్నారు కానీ ఏ ఒక్కరూ మాట్లాడలేదు. అయితే కన్నా మాత్రం నేరుగా టార్గెట్ చేశారు. ఇది సోముపై అసంతృప్తా... లేదంటే బీజేపీపైనా అన్నది మాత్రం తెలియరాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడే యోచనలో వున్నారంటూ వార్తలు వస్తున్నాయి. 

ALso REad:కన్నా బీజేపీని వీడుతారా... వీర్రాజుపై ఆ మాటల వెనుక, అనుచరులతో కీలక భేటీ దేనికి..?

సీనియర్ నేతగా.. మాజీ అధ్యక్షుడిగా వున్న తనకు పార్టీ కార్యక్రమాలపై ఎలాంటి సమాచారం అందడం లేదని కన్నా తీవ్ర అసహనంతో వున్నారు. పలుమార్లు ఈ విషయాన్ని అధిష్టానం పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. కానీ అటు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో తన రాజకీయ జీవితం, కుమారుడి భవిష్యత్‌ను దృష్టిలో వుంచుకుని కీలక నిర్ణయం తీసుకోవాలని లక్ష్మీ నారాయణ భావిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో గుంటూరులోని తన ముఖ్య అనుచరులతో ఆయన కీలక సమావేశం నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిలో ఒక నిర్ణయం తీసుకుని భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించే అవకాశం వుంది.

ఒకవేళ పార్టీ మారాలని నిర్ణయించుకుంటే కన్నా లక్ష్మీ నారాయణ ఏ పార్టీలో చేరుతారనే దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వైసీపీలోకి వెళ్లే అవకాశాలైతే లేవు... తొలి నుంచి జగన్ తీరుపై కన్నా బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. వైఎస్‌కు అత్యంత సన్నిహితంగా వున్న కన్నా.. జగన్‌ పరిపాలనపై అనేకసార్లు విమర్శలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా వుండగా.. టీడీపీ అధినేత చంద్రబాబుపై అసెంబ్లీలోనూ, బయట తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తేవారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబుతో ఆయన క్లోజ్‌గానే వుంటున్నారు. పలు వేదికలను వీరిద్దరూ పంచుకున్నారు. ఇక మరో ఆప్షన్ జనసేన. కాపు సామాజికవర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ తన వర్గానికే చెందిన పవన్ పార్టీలో చేరే దానిపైనా ఆలోచిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 

click me!