ముఖ్యమంత్రి కోరిక నెరవేరాలంటూ మొక్కులు ... నూకాలమ్మ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు

By Arun Kumar P  |  First Published Jun 10, 2024, 3:32 PM IST

ఎన్నికల ప్రచార సమయంలో తాను ముఖ్యమంత్రి కావాలన్న ఫ్యాన్స్ కోరిక నేరవేరాలంటూ అనకాపల్లి నూకాలమ్మను పవన్ కల్యాణ్ మొక్కుకున్న విషయం తెలిసిందే. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మరోసారి అనకాపల్లికి చేరుకున్న పవన్ అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నారు. 


అనకాపల్లి : ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో విజేత చంద్రబాబు నాయుడే... కానీ కింగ్ మేకర్ మాత్రం పవన్ కల్యాణ్. టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఊహకందని విజయం అందుకోవడంతో పవన్ ది కీలక పాత్ర అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ సీట్లను గెలుచుకుని 100శాతం స్ట్రైక్ రేట్ సాధించింది పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ. పిఠాపురం అసెంబ్లీలో పోటీచేసిన పవన్ కూడా బంపర్ మెజారిటీతో గెలిచారు. 

ఇలా అద్భుత విజయాన్ని అందుకున్న పవన్ కల్యాణ్ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఉత్తరాంధ్రలోని  అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని అనుగ్రహించాలని పవన్ మొక్కుకున్నారు. ఆ అమ్మ దయతోనే జనసేన విజయం సాధ్యమయ్యిందని నమ్ముతున్న పవన్ తాజాగా మొక్కు చెల్లించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ముందే పవన్ అమ్మవారిని దర్శించుకున్నారు. 

Latest Videos

undefined

ఉదయమే హైదరాబాద్ నుండి ఆంధ్ర ప్రదేశ్ కు చేరుకున్న పవన్ కల్యాణ్ జనసేన నాయకులతో కలిసి అనకాపల్లికి బయలుదేరారు. నూకాంబికా ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు పవన్ కల్యాణ్. 

పవన్ నూకాలమ్మ దర్శనానికి వస్తున్నారని తెలిసి జనసైనికులు, అభిమానులు భారీగా అనకాపల్లికి చేరుకున్నారు. సినిమాల్లోనే కాదు రాజకీయంగాను సత్తాచాటిన తమ అభిమాన నాయకుడిని ప్రత్యక్షంగా చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. దీంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. పవన్ రాక నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసారు. 

అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసిన పవన్ కళ్యాణ్. https://t.co/QizpBrTIE2 pic.twitter.com/eLYfKImWj1

— Telugu Scribe (@TeluguScribe)

 

పవన్ కు డిప్యూటీ సీఎం..? 

టిడిపి, జనసేన, బిజెపి కూటమి గెలుపులో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లదే కీలక పాత్ర. ఈ ఇద్దరు ఒక్కటై వైసిపిని చిత్తుగా ఓడించారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు కూటమి సిద్దమైంది... మరోసారి చంద్రబాబును ముఖ్యమంత్రి కావడం ఖాయమయ్యింది. మరి పవన్ కల్యాణ్ కు ఏ పదవి దక్కుతుందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. 

ఇప్పటికే పవన్ పదవిపై వివిధ రకాల ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఆయనకు డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన మంత్రిత్వ శాఖ దక్కుతుందని అంటున్నారు. డిప్యూటీ సీఎం ప్రచారాన్ని పవన్ తో పాటు జనసేన నాయకులెవ్వరూ ఖండించడంలేదు... అంతేకాదు ఇటీవల దీనిపై పవన్ ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా ఏం జరుగుతుందో చూద్దాం అంటూ మాట దాటేసారు. దీంతో పవన్ కు డిప్యూటీ సీఎం పదవి పక్కా అయినట్లుగా ప్రచారం మరింత జోరందుకుంది. 

చంద్రబాబు కేబినెట్ లో పవన్  తో పాటు మరొకరికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే అది నాదెండ్ల మనోహరా లేక మరొకరా అన్నది తెలియాల్సి వుంది. ఇక వివిధ కార్పోరేషన్లు, నామినేటెడ్ పదవుల్లోనూ జనసేన నాయకులకు ప్రాధాన్యత వుండనుంది. ఇక బిజెపి నుండి కూడా ఓ ఎమ్మెల్యేకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. 

 
  

click me!