అధికారం శివుడి మెడలో పామని గుర్తుంచుకోండి: వైసీపీకి పవన్ హితవు

By Siva KodatiFirst Published Dec 4, 2020, 10:30 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నెల్లూరు జిల్లా నాయుడుపేట పర్యటన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార వైసీపీపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి జనసేన అంటే ఎందుకంత భయం అని పవన్ ప్రశ్నించారు.

అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో అడ్డుగోడలు కడదామని ప్రయత్నిస్తే గోడలు బద్దలు కొట్టుకుని ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు.

ఓ కానిస్టేబుల్ కొడుకుగా తనకు పోలీసులంటే ఎంతో గౌరవం ఉందని, కానీ పోలీసులు అధికార పక్షం ఒత్తిళ్లతో అక్రమ కేసులు బనాయిస్తే వారిని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు.

తాను వచ్చింది ఎవరితోనూ గొడవ పెట్టుకునేందుకు కాదని, రైతుల్ని పరామర్శించడానికని ఆయన స్పష్టం చేశారు. సింహపురిలో పెరిగినవాడ్నని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమను రెచ్చగొడితే రోడ్లమీదకు రావడానికైనా వెనుకాడేది లేదని పవన్ స్పష్టం చేశారు. తాను చూడ్డానికి మాత్రమే యాక్టర్‌నని, కానీ లోపల యాక్టర్ ఉండడని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలు ఓ విషయం గుర్తుంచుకోవాలని.. అధికారం శివుడి మెడలో పాము వంటిదని... ఆయన మెడలో ఉన్నంత వరకే ఆ సర్పానికి విలువ, రోడ్డు మీదకు వస్తే దాని పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అధికారం లేని రోజున వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటో చూసుకోవాలని హితవు పలికారు.
 

click me!
Last Updated Dec 4, 2020, 10:30 PM IST
click me!