కేసీఆర్ ఇచ్చాడు, మీరేందుకు ఇవ్వరు: జగన్ ను ఏకేసిన పవన్ కల్యాణ్

By Siva KodatiFirst Published Dec 3, 2020, 4:58 PM IST
Highlights

వ్యవసాయం లాభసాటిగా మారాలన్నదే తమ అభిమతమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... జై కిసాన్ అనే పేరిట త్వరలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పవన్ తెలిపారు. 

వ్యవసాయం లాభసాటిగా మారాలన్నదే తమ అభిమతమన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తిరుపతిలో గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన... జై కిసాన్ అనే పేరిట త్వరలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు పవన్ తెలిపారు.

దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి.. జై కిసాన్- జై జవాన్ నినాదాన్ని స్పూర్తిగా తీసుకుని దేశానికి వెన్నెముక అయిన రైతు నష్టపోకుండా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినట్లు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

మేధావులు, శాస్త్రవేత్తలు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించి వ్యవసాయాన్ని లాభసాటిగా ఎలా మార్చాలన్న దానిపై సమగ్ర కార్యాచరణ రూపొందిస్తామని జనసేనాని వెల్లడించారు.

నివర్ తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన రైతులకు రూ.35000 నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసినట్లు పవన్ చెప్పారు. వాలిపోయిన పంటను తీయడానికి డబ్బులు లేని దశలో రైతు ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు.

క్షేత్రస్థాయి పర్యటనల్లో చూసిన అనుభవాల ఆధారంగానే ఎకరానికి రూ.35 వేల పరిహారాన్ని డిమాండ్ చేసినట్లు ఆయన చెప్పారు. రాబోయే 48 గంటల్లో కనీసం పది వేల రూపాయలైనా విడుదల చేయాలని పవన్ ప్రభుత్వాన్ని కోరారు.

హైదరాబాద్‌ వరదల నేపథ్యంలో వరద బాధితులకు తెలంగాణ ప్రభుత్వం రూ.10 వేలు ఇచ్చిందని జనసేనాని గుర్తుచేశారు. ఐదో, పదో ఇచ్చేసి చేతులు దులుపుకుందామనే ఆలోచనను మానుకోవాలని ఆయన వైసీపీ నేతలకు సూచించారు. 

రజనీ రాజకీయ పార్టీపై పవన్ స్పందన:
తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ రాజకీయ పార్టీ పెట్టడంపై పవన్ స్పందించారు. తాను సినిమాల్లో రాకముందు నుంచే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్లు వినిపించేవని ఆయన తెలిపారు.

ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రానప్పటికీ.. పరోక్షంగా ఆ వాతావరణంలోనే సూపర్‌స్టార్ వున్నారని జనసేనాని వ్యాఖ్యానించారు. డీఎంకేను ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చిన విషయాన్ని పవన్ కల్యాన్ గుర్తుచేశారు. రజనీ రాజకీయాల్లో సక్సెస్ కావాలని పవన్ ఆకాంక్షించారు. 

ఢిల్లీలో రైతుల ఆందోళనపై:
మరోవైపు ఢిల్లీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న రైతు ఆందోళనలపైనా జనసేనాని తనదైన శైలిలో మాట్లాడారు. రైతుల మేలు కోసమే బీజేపీ ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఏవైనా లోటుపాట్లు వుంటే చర్చలతో పరిష్కరించుకోవాలని జనసేన అధినేత సూచించారు. ఢిల్లీలో కేంద్రం రైతులతో చర్చలు జరుపుతోందన్నారు.

ఇబ్బందులు లేకుండా, కేసులు లేకుండా, ఒక్క మాట పడకుండా, చొక్కా నలగకుండా రాజకీయాలను ఎవరు చేయలేరని పవన్ చెప్పారు. కార్యకర్తలపై దాడులను ఖండిస్తున్నామని.. వారికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జనసేనాని స్పష్టం చేశారు. 

click me!