
కొత్త ప్రభుత్వం వచ్చాక జగన్‌ను కోర్టుల చుట్టూ తిప్పుతానని హెచ్చరించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ . జగన్, వైసీపీ నాయకుల దోపిడీని బయటకు తీసుకొస్తామని పవన్ తెలిపారు. శనివారం సిరిపురం జంక్షన్‌లోని సీబీసీఎన్‌సీ భూములను పవన్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చర్చి ఆస్తులు దోచేసి వీధి శూల అంటున్నారని మండిపడ్డారు. సీఎం సొంత పేషీలోనే డిజిటల్ సంతకాలు దొంగతనం జరుగుతున్నాయని.. ఇక రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఏంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. విశాఖ వ్యవహారాలు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల దృష్టిలో వున్నాయని ఆయన తెలిపారు.
దేశ భద్రతకు సంబంధించి విశాఖ అత్యంత కీలకమని పవన్ పేర్కొన్నారు. అధికారులు చేయలేని పనిని ప్రజలే చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను రోడ్డు మీదకు రావాలంటే సవాలక్ష ఆంక్షలు పెడుతున్నారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు అభివాదం చేయడానికి వీల్లేదంటున్నారని.. నమస్కారానికి ప్రతి నమస్కారం చేయలేక కారులో కూర్చొంటున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల మెడపై కత్తి పెట్టి పర్మిషన్లు తెచ్చుకుంటున్నారని.. ఐఏఎస్, ఐపీఎస్‌లు రాజ్యాంగాన్ని కాపాడాలని పవన్ కల్యాణ్ కోరారు.
ALso Read: పారిపోతానంటున్నావ్ .. ఎంపీవా, సిగ్గులేదు .. రాజీనామ్ చేయ్ : ఎంవీవీ సత్యనారాయణపై పవన్ ఘాటు వ్యాఖ్యలు
విశాఖపట్నం ప్రశాంతమైన నగరమని.. ఈ ప్రశాంతతను వైసీపీ నాయకులు దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రం వున్నప్పుడు హైదరాబాద్‌లో ఇలాగే దోపిడీ చేస్తే.. తెలంగాణ వాళ్లు తన్ని తగలేశారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు వైసీపీ నాయకుల కన్ను ఉత్తరాంధ్ర భూములపై పడిందని ఆయన ఆరోపించారు. వాళ్లని ఇలాగే వదిలేస్తే ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డ్‌లా మార్చేస్తారని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు బలంగా నిలబడినట్లుగా.. ఇప్పుడు ఉత్తరాంధ్ర కోసం ఆంధ్రా యూనివర్సిటీ విద్యార్ధులు కూడా నిలబడాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. తణుకులో చేసినట్లే విశాఖలోనూ టీడీఆర్ బాండ్స్ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. భార్యా బిడ్డలను, ఆడిటర్‌ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టిన వాళ్లతోనే విశాఖ ఎంపీ ములాఖత్ అయ్యారని పవన్ కల్యాణ్ మండిపడ్డారు.