వైసీపీది దిక్కుమాలిన, దౌర్భాగ్యపు పాలన.. ఇక ఉపేక్షించి లాభం లేదు: పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Sep 23, 2021, 10:09 PM IST
Highlights

ఏపీలో వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలన అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు పాలన భారతదేశంలోనే ఎక్కడా లేదని పవన్ విమర్శించారు. ఈ దౌర్భాగ్యపు పాలనను ఇక చూస్తూ ఊరుకునేది లేదని, గట్టిగా ఎదుర్కోవాలని చాలా బలంగా నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు

వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనంతగా ఎన్నికల హింస చోటుచేసుకుంటోందని పవన్ వ్యాఖ్యానించారు. ఏపీలో వైసీపీది ఒక దౌర్భాగ్యపు, దాష్టీకపు దిక్కుమాలిన పాలన ఆయన మండిపడ్డారు. ఇటువంటి దుర్మార్గపు పాలన భారతదేశంలోనే ఎక్కడా లేదని పవన్ విమర్శించారు.

మంగళగిరి నియోజకవర్గంలో తమ అభ్యర్థి జోజిబాబు 65 ఓట్ల ఆధిక్యంతో గెలిస్తే, రీకౌంటింగ్ చేయాలని వైసీపీ అభ్యర్థులు పట్టుబట్టారని, చివరికి వైసీపీ అభ్యర్థి 18 ఓట్లతో గెలుపొందినట్లు ప్రకటించుకున్నారని పవన్ కల్యాణ్ ధ్వజమెత్తారు. పోలీసులు, ఓట్ల లెక్కింపు సిబ్బంది కూడా వైసీపీ నేతలకు మద్దతుగా నిలిచారని, గెలిచిన తమ అభ్యర్థిని ఓడిపోయేలా చేశారని ఆయన ఆరోపించారు.

కడప జిల్లా రైల్వే కోడూరులోనూ తమ అభ్యర్థులకు చెందిన ఐదు ఎంపీటీసీ నామినేషన్లను పోలీసులే స్వయంగా తీసేశారని మండిపడ్డారు. వాళ్లు పోలీసుల్లా ప్రవర్తించలేదని, వైసీపీ కార్యకర్తల్లా వ్యవహరించారని పవన్ ఆరోపించారు. ఈ దారుణ పాలన పట్ల అందరికీ ఓపికలు నశించిపోయాయని, జనసేన కూడా ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు.

151 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ రాష్ట్రాన్ని ఎంతో సుభిక్షంగా పాలిస్తుందని ఆశించామని, ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకుంటుందని భావించామని పవన్ వెల్లడించారు. కానీ ఈ దౌర్భాగ్యపు పాలనను ఇక చూస్తూ ఊరుకునేది లేదని, గట్టిగా ఎదుర్కోవాలని చాలా బలంగా నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. ఇకపై ప్రతి నెలా రాష్ట్రంలో జనసేన నేతల పర్యటనలు ఉంటాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

click me!