నాడు బషీర్‌బాగ్, నేడు పెందుర్తి: బాబుపై పవన్ సంచలనం

First Published Jul 4, 2018, 6:27 PM IST
Highlights

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ మరోసారి నిప్పులు చెరిగారు. బషీర్‌బాగ్ మాదిరిగానే పెందుర్తిలో  రైతులను బాబు పొట్టనపెట్టుకొంటున్నారని ఆయన విమర్శించారు. భూకబ్జాలకు పాల్పడేవారికి ఏపీ సర్కార్ అండగా నిలుస్తోందని పవన్ ఆరోపించారు.


విశాఖపట్టణం: బషీర్‌బాగ్‌లో రైతులను ఎలా కాల్పి చంపారో .. పెందుర్తిలో కూడ రైతులను టీడీపీ ప్రభుత్వం పొట్టనపెట్టుకొంటుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ విమర్శలు గుప్పించారు. పెందుర్తిలో ఎమ్మెల్యే, ఆయన తనయుడు ప్రజలను బెదిరింపులకు గురి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆరోపించారు.

బుధవారం నాడు ప్రజాపోరాట యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్  పెందుర్తిలో నిర్వహించిన సభలో ప్రసంగించారు.  పెందుర్తి ఎమ్మెల్యే, ఆయన తనయుడు రైతులను మారణాయుధాలతో బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలు మీతో దెబ్బలు తినేందుకే ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.

ఇదే రకంగా వ్యవహరిస్తే ప్రజా ఉద్యమాలు వస్తాయని ఆయన ఎమ్మెల్యేను హెచ్చరించారు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదంటూ పవన్ కళ్యాణ్ పెందుర్తి ఎమ్మెల్యేకు హెచ్చరికలు జారీ చేశారు. జనసేన శాంతంగా ఉండే పార్టీ కాదు శాంతం వహించే పార్టీ అంటూ పవన్ చెప్పారు. 

పెట్రో కారిడార్ కోసం  రైతుల నుండి 300 ఎకరాలను లాక్కొన్నారని ఆయన చెప్పారు. కానీ, ఈ భూమిని కోల్పోయిన రైతులకు పరిహరం చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలన్నారు.

భూకబ్జాలకు పాల్పడే వారికి టీడీపీ ప్రభుత్వం అండగా నిలువడాన్ని తాను ఏనాడూ కూడ ఊహించలేదన్నారు. ప్రజలకు అండగా ఉంటుందనే ఉద్దేశ్యంతోనే తాను అప్పట్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన విషయాన్ని ఆయన ప్రకటించారు.

విశాఖలో రైల్వేజోన్ కు అడ్డు పడిందే టీడీపీ నేతలని ఆయన విమర్శించారు. జోన్ కు అడ్డుపడి ఇవాళ దీక్షలంటూ డ్రామాలు ఆడుతున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. 
 

click me!