టీడీపీ వెనుక నడవటం లేదు .. కలిసి నడుస్తున్నాం, సీఎం పదవిపై చంద్రబాబుతోనే తేల్చుకుంటా : పవన్ కళ్యాణ్

By Siva KodatiFirst Published Dec 7, 2023, 7:19 PM IST
Highlights

మేం టీడీపీ వెనుక నడవటం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సీఎం ఎవరనేది చంద్రబాబు నాయుడు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

మేం టీడీపీ వెనుక నడవటం లేదు, టీడీపీతో కలిసి నడుస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గురువారం విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. జనసైనికుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టనని, ఎక్కువ సీట్లు గెలిస్తే సీఎం పదవి అడగవచ్చని ఆయన పేర్కొన్నారు. సీఎం ఎవరనేది చంద్రబాబు నాయుడు, తాను కూర్చొని నిర్ణయం తీసుకుంటామని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

అన్నీ ప్రజలకు చెప్పేచేస్తామని.. మీ ఆత్మగౌరవం ఎప్పుడూ తగ్గించనని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అలయన్స్ తప్పించి మరో ప్రత్యామ్నాయం లేదని పవన్ వెల్లడించారు. మేం ఎవరికీ బీ పార్టీ కాదని, నన్ను నేను తగ్గించుకొనైనా మిమ్మల్ని పెంచడానికి తాను సిద్ధమని జనసేనాని స్పష్టం చేశారు. డొంక తిరుగుడు పనులు చేయనని, ఎవరు తనతో వచ్చినా రాకున్నా తాను నడుస్తూనే వుంటానని పవన్ కల్యాణ్ వెల్లడించారు. 

Latest Videos

అధికారం కోసం తాను ఓట్లు అడగనని.. మార్పు కోసం ఓట్లు కావాలన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.  యువతరం కోసమే తన ఆలోచన అన్నారు. ఈ తరాన్ని కాపాడుతూ.. రాబోయే తరం గురించి పనిచేస్తానని పవన్ పేర్కొన్నారు. ఎన్నికల గురించి ఎప్పుడూ ఆలోచించనని.. ఉత్తరాంధ్ర చైతన్యం ఉన్న నేల అని ఆయన తెలిపారు, కానీ ఇక్కడి వారు వలస పోతున్నారని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర అందరినీ అక్కున చేర్చుకుంటుందని, డబ్బులు లేకున్నా పార్టీని ఒంటిచేత్తో నడుపుతున్నానంటే మీ ప్రేమాభిమానాలే కారణమని పవన్ కల్యాణ్ తెలిపారు. 

సినిమాల్లో నన్ను ఆదరించడంతో మీ కోసం పనిచేయాలని వచ్చానని జనసేనాని అన్నారు. పొగిడితే కొందరు ఉప్పొంగిపోతారని, కానీ తాను ప్రతి కష్టానికి ఉప్పొంగిపోతానని పవన్ చెప్పారు. తెలంగాణ యువత బలిదానాలతో రాష్ట్రాన్ని తెచ్చుకున్నారని, 151 సీట్లు వైసీపీకి ఇస్తే ఒక్కసారి కూడా సరైన జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారని జనసేనాని ఎద్దేవా చేశారు. తాను మీ భవిష్యత్తు కోసం నానా తిట్లు తింటున్నానని.. రాజకీయాలు కలుషితమయ్యాయని యువత రావడం లేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని.. సినిమాలు మాత్రమే చేస్తే నాది స్వార్ధమైన జీవితం అవుతుందని జనసేనాని పేర్కొన్నారు. 

మీు పాతికేళ్ల భవిష్యత్ ఇస్తే నాకు వందల రెట్లు సంతోషాన్ని ఇస్తుందని పవన్ చెప్పారు. ఎవరికైనా ఓడిపోతే భయమేస్తుందని, ఎన్ని ఓటములు ఎదురైనా తాను పోరాడుతూనే వున్నానని ఆయన తెలిపారు. విజయానికి దగ్గరి దారులు లేవని, నిలబడి చూపించడమే నాయకుడి కర్తవ్యమన్నారు. బీజేపీలో చేరితే తాను కోరుకున్న పదవి ఇస్తారని.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్‌ను అడ్డుకున్నానని, విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు. 

విశాఖ ఉక్కు భావోద్వేగంతో కూడిన అంశమని, ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు చెప్పానని పవన్ వెల్లడించారు. విశాఖ ఉక్కుపై నా అభిప్రాయాన్ని అమిత్ షా గౌరవించారని, విశాఖ స్టీల్ ప్లాంట్ పోరాటం అన్ని జిల్లాలను ఏకం చేసిందని జనసేనాని తెలిపారు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రులను ఏకతాటిపై వుంచిన నినాదమని ఆయన వెల్లడించారు. కష్టం వస్తే ఆందుకుంటామని చెప్పేందుకే జాలర్లను ఆదుకున్నానని, ఉత్తరాంధ్ర వలసలు ఆగాలని, ఇక్కడే ఉపాధి అవకాశాలుండాలని జనసేనాని ఆకాంక్షించారు. 

click me!