
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు . రాజకీయాల్లో మార్పు కోసం పోరాడుతున్నానని.. ఈ పోరాటంలో తన ప్రాణాలు పోవచ్చన్నారు. వారాహి విజయ యాత్రలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని బీఆర్ అంబేద్కర్ జంక్షన్‌లో ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం కోసం పోరాడిన నేతల స్పూర్తితో పరిపాలన జరగాలన్నారు. జగన్‌పై వ్యక్తిగత కక్ష, ద్వేషం లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎంతమందికి జగన్ ఉద్యోగాలు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఏపీకి వచ్చిన కంపెనీలు వెనక్కి పోతున్నాయని.. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోతున్నారని పవన్ దుయ్యబట్టారు. సీఎంగా వున్న వ్యక్తి ఎలాంటి త్యాగాలు చేయలేదన్నారు.
అన్యాయంపై ఎదురు తిరగాలని మనకు పాఠశాలల్లో నేర్పించారని పవన్ పేర్కొన్నారు. సహజవనరులను కొందరు నేతలు కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. కనీస వసతులు అందరికీ అందాలని , అది ప్రాథమిక హక్కని పవన్ పేర్కొన్నారు. ప్రాథమిక సౌకర్యాలు లేకుంటే ప్రజలు ఉద్యమం చేస్తారని జనసేనాని హెచ్చరించారు. అవినీతి, దోపిడీయే లక్ష్యంగా కొందరు నేతలు పరిపాలిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఎవరో ఒకరు మొదలుపెట్టకపోతే సమాజంలో మార్పు రాదన్నారు. రాష్ట్రాన్ని, వనరులను ముఖ్యమంత్రి, మంత్రులు దోపిడీ చేస్తున్నారని పవన్ ఆరోపించారు.
జగన్ పాలనలో దళితులను చంపిన హంతకులు బయటే తిరుగుతున్నారని ఆయన దుయ్యబట్టారు. కొందరు దిగజారి తనను బూతులు తిడుతున్నారని.. తాను ఎప్పుడు గొంతెత్తినా తన కోసం కాదన్నారు. అన్ని భరిస్తానని.. చివరికి తన రెండు చెప్పులను ఎత్తికెళ్లిపోయినా భరిస్తానని పవన్ సెటైర్లు వేశారు.