జగన్ అలా చూడొద్దు, కశ్మీర్ సమస్యే పరిష్కారం కాగా కాపు రిజర్వేషన్లు ఎంత : పవన్ కళ్యాణ్

By Nagaraju penumalaFirst Published Aug 5, 2019, 5:19 PM IST
Highlights

కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలని నిలదీశారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని జగన్ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. 
 

భీమవరం: అంతర్జాతీయ వివాదంగా ఉన్న జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కారం కంటే కాపు రిజర్వేషన్ల అంశం చాలా సులభమని చెప్పుకొచ్చారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. కశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు మార్గాలు వెతుకుతున్న ప్రభుత్వాలు కాపు రిజర్వేషన్ల అంశాన్ని ఎందుకు పరిష్కరించడం లేదో చెప్పాలని నిలదీశారు. 

రెండు రోజుల పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కాపుల రిజర్వేషన్‌ అంశాన్ని జగన్ రాజకీయ కోణంలో మాత్రమే చూస్తున్నారని విమర్శించారు. 

వ్యక్తిగత కక్షలతో పోలవరం ప్రాజెక్టును ఆపడం సరైనది కాదని హితవు పలికారు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా తప్పులు, అవినీతి జరిగి ఉంటే వాటిని ఎత్తిచూపాలే కానీ ప్రాజెక్టులు ఆలస్యం చేయడం సరికాదంటూ మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్టుల విషయంలో రీ టెండరింగ్ వల్ల ప్రాజెక్టు ఆలస్యం అవ్వడమే కాకుండా అలాంటి చర్యలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయన్నారు. అవినీతిని వెలికి తీస్తామంటున్న విషయంలో జనం నష్టపోకూడదన్నారు. 

అమరావతిలో పనులు ఆపడం వల్ల విదేశీ పెట్టుబడులపై విశ్వసనీయత పోతుందని అభిప్రాయపడ్డారు. ఇది సరైన నాయకులు చేసే పని కాదన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగిన వారే తిరిగి నేడు తూట్లు పొడుస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. నాయకుల్లో ప్రజల్లో ఆవేదన ఉంటేనే హోదా సాధ్యమవుతుందన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల్లో ఉన్న భావోద్వేగం ఏపీ ప్రజల్లో లేదంటూ విమర్శించారు. 

click me!