తప్పు చేస్తే ప్రశ్నిస్తాం, మంచి చేస్తే ప్రశంసిస్తాం: జగన్ ప్రభుత్వంపై పవన్ వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Jun 24, 2019, 5:44 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇస్తామని తెలిపారు. వైసీపీ సర్కార్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే తాము మద్దతు ఇస్తామని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే తిరగబడతామన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నామన్నారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలోపేతం దిశగా జనసేన పార్టీ వ్యూహరచనతో ముందుకు వెళ్లబోతుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. భవిష్యత్ లో జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేయడంతోపాటు అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. 

అందులో భాగంగా పార్టీని బలోపేతం చేసేందుకు నాలుగు కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గతంలో జనసేన పార్టీకి సేవలందించిన నేతలు, భవిష్యత్ లో జనసేన పార్టీ తరపున ప్రజల వాణిని బలంగా వినిపించే వారికి జనసేన పార్టీ కమిటీల్లో కీలక స్థానం కల్పించినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. 

2014లో జనసేన పార్టీని స్థాపించినప్పుడే అన్నింటికి తెగించి వచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోతే తన పరిస్థితి ఏంటి, పార్టీని నడపగలనా అనే అంశాలపై ఆలోచించే ముందడుగు వేశానని అన్నారు. 

గతంలో తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించాను కాబట్టే ఆ పార్టీని ప్రశ్నించే హక్కు ఉందన్నారు. తెలుగుదేశం పార్టీని సైతం గతంలో నిలదీసినట్లు తెలిపారు. సంవత్సరంపాటు తెలుగుదేశం పార్టీకి తాను సమయం ఇచ్చానన్నారు. 

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఏడాది పాటు సమయం ఇస్తామని తెలిపారు. వైసీపీ సర్కార్ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడితే తాము మద్దతు ఇస్తామని ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడితే తిరగబడతామన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరుగుతున్న పరిణామాలను గమనిస్తూనే ఉన్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్ లోని ఏపీ ఆస్తులను తెలంగాణ ప్రభుత్వానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేసిందని ఎలా ఇచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కారణాలు ఉన్నా కానీ ప్రస్తుతం కొత్త ప్రభుత్వం కాబట్టి సమయం ఇస్తామన్నారు. ఆ తర్వాతే పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా 100 రోజులు వేచి చూస్తామని అప్పడు వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నచ్చితే ఏడాది వరకు వేచి చూస్తామన్నారు.

ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ జనసేన పార్టీ బలంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. ప్రజాక్షేత్రంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించే మేధావి వర్గం తమ దగ్గర ఉందన్నారు. ఎట్టిపరిస్థితుల్లో జనసేన పార్టీ కొనసాగుతుందని ప్రజల పక్షాన పోరాటం చేస్తోందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 
 

click me!