జగన్ ప్రభుత్వం చెబుతున్న కరోనా లెక్కలు తప్పు: పవన్ కల్యాణ్

By telugu team  |  First Published May 9, 2020, 4:55 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కు సంబంధించి ప్రభుత్వం చెబుతున్న లెక్కలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇంకా ఎక్కువ కేసులే ఉంటాయని చెబుతున్నారని ఆయన అన్నారు.


అమరావతి: కరోనా పాజిటివ్ కేసులు అధికారికంగా ప్రకటిస్తున్నవాటి కంటే ఎక్కువగానే ఉంటున్నాయని వైద్య నిపుణుల నుంచి సమాచారం వస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ అన్నారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే 96 కేసుల వరకూ ఉన్నాయని అంటున్నారని, అంతకంటే ఎక్కువగానే ఉన్నాయనే ఆందోళన ప్రజానీకంలో నెలకొందని చెప్పారు. పొరుగున ఉన్న తమిళనాడులో కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి కాబట్టి మన రాష్ట్రంలోనూ మరింత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 

చెన్నైతో నెల్లూరు, చిత్తూరు జిల్లావారికి వ్యాపారపరమైన సంబంధాలు, రాకపోకలు ఉంటాయి.. అక్కడి కోయంబేడు మార్కెట్ కి వ్యవసాయ ఉత్పత్తులు వెళ్తుంటాయి కాబట్టి ఆ జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. శనివారం ఉదయం నెల్లూరు జిల్లా జనసేన నాయకులతో పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి, కేసుల సంఖ్య పెరగడం, ఆసుపత్రుల్లో అందుతున్న సేవలు, ప్రజా సమస్యలపై చర్చించారు. 

Latest Videos

undefined

ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ మాట్లాడారు.  "కరోనా ఎక్కువ కాలం ఉండే ఆరోగ్య సంబంధిత సమస్య అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఈ సమస్య అదుపులోకి వచ్చేందుకు రెండున్నర సంవత్సరాలు పట్టవచ్చని నిపుణుల వ్యాసాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ దేశానికీ దేశానికీ రూపం మార్చుకొంటోంది... కాబట్టి ఒకే వ్యాక్సిన్ తో కాకపోవచ్చు... వైరస్ రూపానికి తగ్గ విధంగా వ్యాక్సిన్లు తీసుకురావాల్సి ఉంటుందని ఫార్మా నిపుణులు అభిప్రాయపడుతున్నారు" అని పవన్ కల్యాణ్ అన్నారు. 
"వ్యాక్సిన్ వచ్చే వరకూ సోషల్ డిస్టెన్స్ పాటించడం, మాస్కులు ధరించడం లాంటివి చేయాలి. ఇవి మనం పాటించే నిబంధనల్లో భాగంగా మారవచ్చు. కరోనా ప్రభావం, లాక్ డౌన్ వల్ల పలు రంగాలు దెబ్బ తిని, నష్టపోయాయి. వివిధ వృత్తుల్లో ఉన్నవారు ఆర్థికంగా సమస్యల్లో ఉన్నారు. వాటిపట్ల ప్రభుత్వం సానుభూతితో స్పందించి సహకారం అందించాలి" అని ఆయన అన్నారు. 

"నెల్లూరు జిల్లాలో స్వర్ణకారులు, చేనేత వృత్తిలో ఉన్నవారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులుపడుతున్నారు. చేతి వృత్తులు, కులవృత్తుల్లో ఉన్నవారికీ భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ జిల్లాలో వరి, నిమ్మ రైతులు, ఆక్వా రంగంలో ఉన్నవారు దెబ్బ తిన్నారు. వీరందరి సమస్యలు నా దృష్టికి వచ్చాయి. ఎప్పటికప్పుడు స్పందిస్తున్నాం. ప్రతి రంగం ఏ విధంగా ప్రభావితమైంది, ఉపాధికి గండిపడిందీ అనే విషయాలపై సమగ్రంగా నివేదిక సిద్ధం చేస్తున్నాం" అని పవన్ కల్యాణ్ చెప్పారు. 

"నెల్లూరు జిల్లాలో జనసేన నాయకులు, శ్రేణులు ఆపదలో ఉన్నవారికి చేస్తున్న సేవలు అభినందనీయం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా అండగా నిలవాలి అన్నది మన పార్టీ విధానం. అందుకు అనుగుణంగా మీరంతా పని చేస్తున్నారు. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజా పక్షమే. వారికే సమస్య వచ్చినా అండగా నిలిచి అది పరిష్కారం అయ్యే వరకూ బలంగా మాట్లాడతాం" పవన్ కల్యాణ్ అన్నారు. 

click me!