పాలకులకు తెలుగుపై ఆసక్తి లేదు.. భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : పవన్ కళ్యాణ్

By Rajesh KarampooriFirst Published Aug 29, 2023, 1:48 PM IST
Highlights

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అంజలి ఘటించారు. వ్యావహారిక భాషోద్యమాన్ని నడిపిన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారిని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదని పేర్కొన్నారు. 

తెలుగు భాషను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేర్కొన్నారు. మాట్లాడే భాష... రాసే భాష ఒకటి కావాలని తపించి.. ఆ దిశగా వ్యవహారిక భాషోద్యమాన్ని నడిపిన గిడుగు వెంకట రామమూర్తి (Gidugu Venkata Ramamurthy)ని తెలుగు జాతి ఎన్నడూ మరువకూడదని అన్నారు.  ఇవాళ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారికి సభక్తికంగా అంజలి ఘటిస్తున్నానని పేర్కొన్నారు. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోకి తీసుకువచ్చి మన మాతృభాషకు జీవంపోశారని జనసేనాని ప్రశంసించారు.

ఆంధ్ర ప్రదేశ్ పాలకుడికి ఎలాగూ తెలుగు అంటే ఆసక్తి లేదనీ, కాబట్టి ప్రజలే తెలుగు భాషను కాపాడుకొనే బాధ్యతను స్వీకరించాలని సూచించారు. తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటైన ప్రభుత్వ విభాగాల పని తీరును గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిదనీ, వారు విడుదల చేసే ప్రకటనల్లోనూ, విద్యా శాఖ నుంచి వచ్చే ప్రకటనల్లో ఎన్ని అక్షర దోషాలు ఉంటున్నాయో చూస్తేనే తెలుస్తోందని విమర్శించారు.

Latest Videos

అలాంటి వారి నుంచి భాషా వికాసాన్ని ఆశించలేమనీ, వ్యావహారిక భాషోద్యమానికి మూల పురుషుడైన శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి స్ఫూర్తిని తెలుగు భాషాభిమానులు, అధ్యాపకులు, సాహితీవేత్తలు అందిపుచ్చుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు.చిన్నారులు ఓనమాలు నేర్చుకొనే దశ నుంచే మాతృ భాషను దూరం చేసే విధంగా ఉన్న పాలకుల తీరు వల్ల కలిగే అనర్ధాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని జనసేనాని పేర్కొన్నారు. 

click me!