సకాలంలో స్పందించి ఉంటే బతికి ఉండేవాడు: చిత్తూరులో రత్నం అనే రైతు మృతిపై పవన్ కళ్యాణ్

By narsimha lodeFirst Published Sep 4, 2022, 3:16 PM IST
Highlights

పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ రైతు రత్నం మరణించడానికి ప్రభుత్వం కారణమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  అభిప్రాయపడ్డారు. అధికారులు, ప్రజా ప్రతినిధుల అలసత్వం కారణంగా ఈ ఘటన చోటు చేసుకందని ఆయన అభిప్రాయపడ్డారు. 

అమరావతి: ప్రభుత్వ అలసత్వం కారణంగా చిత్తూరు జిల్లాలో రైతు రత్నం  మరణించాడని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. చిత్తూరు జిల్లాలోని పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ  రత్నం అనే రైతు మృతి చెందిన ఘటనపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  స్పందించారు.ఈ విషయమై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  ఆదివారం నాడు ప్రకటన విడుదల చేశారు.  ప్రజా ప్రతినిధులు, అధికారులు సకాలంలో స్పందిస్తే రైతు ప్రాణం నిలబడేదన్నారు.అక్రమ కేసులు పెట్టే  వైసీపీ ప్రభుత్వానికి ఇలాంటి ఘటనలను పట్టించుకొనే తీరిక లేదని ఆయన విమర్శించారు.  ఈ ఘటనకు  బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేనాని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.

చిత్తూరు జిల్లా పెనుమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తూ రత్నం అనే రైతు శనివారం నాడు మృతి చెందడం దురదృష్టకరంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం గ్రామ పంచాయితీ  పరిధిలోని  రత్నం తమ కుటుంబం 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని గ్రామస్తులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తున్నాడు..ఈ భూమిని తమకు దక్కకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో గ్రామస్తులు అడ్డు పడుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఈ విషయమై 2009లో రత్నం కోర్టును ఆశ్రయించాడు. ఈ భూమి రత్నానికే చెందుతుందని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే కొందరు గ్రామస్తులు రత్నానికి చెందిందిగా చెబుతున్న భూమిలో ఇళ్లు నిర్మించారని రత్నం కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ విషయమై తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన తహసీల్దార్ కార్యాలయం ముందు రెండు రోజులుగా నిరసనకు దిగాడు. నిరసన చేస్తూనే ఆయన మృతి చెందాడు.
 

click me!