మామూలు జ్వరం కాదు: వైఎస్ జగన్ కు పవన్ కల్యాణ్ కౌంటర్

By telugu teamFirst Published Apr 28, 2020, 8:32 PM IST
Highlights

కరోనా వైరస్ మీద ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కరోనా వైరస్ మామూలు జర్వం ఏమీ కాదని ఆయన అన్నారు.

విజయవాడ: కరోనా వైరస్ చూపిస్తున్న దుష్ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ తర్జనభర్జనలు పడుతున్నాయని, ఇది చిన్నపాటి సాధారణ జ్వరం కాదని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఈ వైరస్ రోగి ఊపిరితిత్తులను దెబ్బ తీసేలా ప్రభావం చూపే ప్రమాదం ఉందని మెడికల్ జర్నల్స్, అధ్యయన పత్రాలు చెబుతున్నాయన్నారు. కాబట్టి కరోనా విషయంలో అందరం అప్రమత్తంగా ఉండాల్సిందే అని తెలిపారు. 

కరోనా వైరస్ కూడా మామూలు జ్వరంలాంటిదేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పిన మాటలకు ఆయన పరోక్షంగా ఆ విధంగా కౌంటర్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లా జనసేన నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కరోనా వ్యాప్తి, రోగులకు అందుతున్న సేవలు, క్వారంటైన్ కేంద్రాల్లో సమస్యలు, లాక్ డౌన్ వల్ల ఉత్పన్నమవుతున్న పరిస్థితులపై సమీక్షించారు. ఈ సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉభయ గోదావరి జిల్లా పార్టీ బాధ్యులు, పి.ఏ.సి. సభ్యులు కె.నాగబాబు పాల్గొన్నారు. 

ఈ సంధర్భంగా పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ  - “కరోనాను నియంత్రించే ఔషధం వచ్చే వరకూ సమస్య ఉంటుంది. ప్రపంచ దేశాల అధినేతలందరూ ఎలా బయటపడాలా అనే ఆలోచిస్తున్నారు. మన దేశ పరిస్థితుల్లో ఈ మహమ్మారిని తట్టుకోవడం కష్టమే. 100 పడకలు ఉన్న చోటకు 500మంది రోగులు వస్తే నియంత్రించలేము. ఇలాంటి పరిస్థితులలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  దూరదృష్టితో ఆలోచించి లాక్ డౌన్ నిర్ణయం తీసుకున్నారు"  అని అన్నారు. "ఈ నిర్ణయాన్ని కొందరు హర్షించలేదు. విశాల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని చేసిన కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మన పార్టీ స్వాగతించింది. మోడీ గారు తీసుకున్న నిర్ణయం ప్రయోజనకరంగా ఉంది" అని అన్నారు. 

"కరోనా వల్ల ఉత్పన్నమవుతున్న సమస్యలపై సత్వరం స్పందించి ప్రజలకు అండగా ఉండాలి. ఇలాంటి తరుణంలో సమస్యను పక్కదోవ పట్టించేందుకో, దృష్టి మరల్చాలనో వివాదాస్పద ప్రకటనలు చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని ఎవరూ పట్టించుకోవద్దు. సమస్య ఏమిటి? ఎలా పరిష్కరిస్తున్నారు అనే విషయం మీదే దృష్టిపెట్టాలి" అని పవన్ కల్యాణ్ అన్నారు. "జనసేన నాయకులు, శ్రేణులు ఎవరూ సంయమనం కోల్పోవద్దు. నిర్మాణాత్మకంగానే మాట్లాడదాం. మనపై చేసే వివాదాస్పద ప్రకటనలు, విమర్శలకు తగిన సమయంలో సమాధానం ఇద్దాం" అని అన్నారు. 

"ఇప్పుడు మన కర్తవ్యం అంతా సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచి వారికి సహాయ సహకారాలు అందించడమే. ఇప్పటికే మన శ్రేణులు ప్రజలకు అవసరమైన సేవలను అందిస్తున్నాయి. చిన్నపాటి ఆదాయం ఉన్న జనసైనికులు కూడా తమ వంతుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకొంటున్నారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు" అని పవన్ కల్యాణ్ అన్నారు.. 

"రైతులు, ఆక్వా రైతుల సమస్యల గురించి తెలియగానే ప్రభుత్వం దృష్టికి వెళ్ళేలా స్పందించాం. అదే విధంగా ఆటో డ్రైవర్లు, వలస కార్మికులు, చిరుద్యోగులు, కుల వృత్తులవారు ఎదుర్కొంటున్న కష్టాలు నా దృష్టికి చేరాయి. ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు తగిన రీతిలో స్పందిద్దాం” పవన్ కల్యాణ్ అన్నారు.

click me!