జమ్మలమడుగు నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, బీజేపీ నుంచి ఆది నారాయణ రెడ్డి పోటీ చేస్తున్నారు. వీరిలో గెలుసు ఎవరిది అనేది సాయంత్రానికి క్లారిటీ రానుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జమ్మలమడుగు ప్రత్యేకం. ఫ్యాక్షన్ రాజకీయాలకు కేరాఫ్‌గా నిలిచిన ఈ నియోజకవర్గం కాకలు తీరిన రాజకీయ నేతలను దేశానికి అందించింది. ఆధిపత్యం , పగలు, ప్రతీకారానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోగా.. జీవచ్ఛవాలుగా మిగిలిన వారు ఎందరో. పొన్నపురెడ్డి, చదిపిరాళ్ల, దేవగుడి కుటుంబాలు జమ్మలమడుగు రాజకీయాలను శాసిస్తున్నాయి. చదిపిరాళ్ల, పొన్నపురెడ్డి కుటుంబాల మధ్య ఎన్నో ఏళ్లుగా ఆధిపత్య పోరు నడుస్తోంది.
బాంబుల శివారెడ్డిగా గుర్తింపు తెచ్చుకున్న పొన్నపురెడ్డి శివారెడ్డి 20 ఏళ్ల పాటు జమ్మలమడుగును శాసించారు. 1983, 1985, 1989లలో తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి 1994, 1999లలో టీడీపీ తరపున వరుస విజయాలు సాధించారు. అయితే ఆదినారాయణ రెడ్డి ఎంట్రీతో పొన్నపురెడ్డి కుటుంబానికి చెక్ పడినట్లయ్యింది. 2004 నుంచి 2014 వరకు ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి.. తర్వాత వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య టీడీపీలో చేరారు.
1952లో ఏర్పడిన జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో పెద్దముడియం, మైలవరం, కొండాపురం, జమ్మలమడుగు, ముద్దనూరు, యర్రగుంట్ల మండలాలున్నాయి. ఈ సెగ్మెంట్‌లో మొత్తం ఓటర్ల సంఖ్య 2,05,167 మంది. వీరిలో పురుషులు 1,17,329 మంది.. మహిళలు 1,23,757 మంది. జమ్మలమడుగులో కాంగ్రెస్ నాలుగు సార్లు, టీడీపీ ఐదు సార్లు, ఇతరులు నాలుగు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ ములే సుధీర్ రెడ్డికి 1,25,005 ఓట్లు.. టీడీపీ అభ్యర్ధి రామసుబ్బారెడ్డికి 73,064 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైసీపీ 51,941 ఓట్ల మెజారిటీతో జమ్మలమడుగులో విజయం సాధించింది.
జమ్మలమడుగు శాసనసభ ఎన్నికల ఫలితాలు 2024
మరోసారి గెలిచి జమ్మలమడుగులో హ్యాట్రిక్ నమోదు చేయాలని వైసీపీ భావిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డిని మరోసారి బరిలోకి దించింది. ఇక కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి జమ్మలమడుగును కేటాయించారు చంద్రబాబు. సీనియర్ నేత ఆదినారాయణ రెడ్డి పోటీ చేశారు. వీరిలో విజయం ఎవరిది అనేది కాసేపట్లో తేలనుంది.