బాబు సిఎం కావడానికి నేనూ కారణం: జైరమేష్, టీడీపి ఎమ్మెల్యేలపై సంచలన వ్యాఖ్య

By Nagaraju penumalaFirst Published Feb 15, 2019, 6:34 PM IST
Highlights

ఈ ఐదేళ్లలో ఒక్కో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రూ.50 నుంచి రూ.100 కోట్లు సంపాదించారని ఆరోపించారని టీడీపీకి చెందిన ఓ ఎంపీ తనతో చెప్పారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు ఏం మంచి చేస్తారని చెప్పుకొచ్చారు. 
 

హైదరాబాద్: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నైతిక విలువలు నచ్చడంతో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేష్ అన్నారు. లోటస్ పాండ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. 

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు వైఎస్ జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని జోస్యం చెప్పారు. మంచి రోజు చూసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతానంటూ స్పష్టం చేశారు. 

వైఎస్ జగన్ ఆదేశిస్తే విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. పోటీ చేసినా, చేయకపోయినా పార్టీలో మాత్రం చేరతానన్నారు. తమ భేటీలో ఎలాంటి డిమాండ్లు లేవని, పార్టీ విషయాలు, ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలిపారు. వైఎస్ జగన్‌తో కలిసి నడిచేందుకు నిర్ణయించుకున్నానని తెలిపారు. 

జగన్‌కు ఉన్న ప్రజాదరణ చూస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ సీపీ ప్రభంజనం వీస్తుందన్నారు. జగన్ ఇచ్చిన మాటపై నిలబడితారని, చంద్రబాబు మాత్రం ఇచ్చిన మాటపై ఏనాడు నిలబడలేదని విమర్శించారు. 

తాను 2001 నుంచి తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నానని స్పష్టం చేశారు. 1999లో గన్నవరం అసెంబ్లీ, విజయవాడ పార్లమెంట్‌ సీటు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ తర్వాత మాట తప్పారన్నారు. 

అప్పటి నుంచి తాను టీడీపీకి దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. 35 ఏళ్లపాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేశానని కానీ ఏనాడు రూపాయి కూడా ఆశించలేదన్నారు. ఇవాళ్లి నుంచి తాను తెలుగుదేశం సభ్యుడిని కాదన్నారు. 

చంద్రబాబుకు కూడా తాను వ్యక్తిగతంగా సాయం చేశానని తెలిపారు. గతంలో నాదెండ్ల భాస్కరరావు సీఎం అయినప్పుడు తెలుగుదేశం పార్టీని కాపాడటానికి ఎంతో కృషి చేశానని తెలిపారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే విజయవాడ పార్లమెంట్ కు పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు.  

తెలుగు జాతిని అవమానించేలా చంద్రబాబు నాయుడు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.. అయిదేళ్ల చంద్రబాబు పాలనలో ఉన్నంత అవినీతి తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. 

ఈ ఐదేళ్లలో ఒక్కో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రూ.50 నుంచి రూ.100 కోట్లు సంపాదించారని ఆరోపించారని టీడీపీకి చెందిన ఓ ఎంపీ తనతో చెప్పారని చెప్పుకొచ్చారు. రాష్ట్రాన్ని దోచుకుని ప్రజలకు ఏం మంచి చేస్తారని చెప్పుకొచ్చారు. 

ప్రతి పనికి ఇరవై మించి కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. బాబు ప్రభుత్వంలో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్న ఆయన త‍్వరలో మంచి రోజుల వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
ఇకపోతే దాసరి జైరమేష్ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా కొనసాగుతున్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా చెప్పుకుంటారు. ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు అత్యంత సన్నిహితంగా ఉండేవారని రాజకీయాల్లో వినికిడి. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సమయంలో దాసరి జైరమేష్ వెంట సీనియర్ రాజకీయ వేత్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్ తోపాటు పలువురు నేతలు ఉన్నారు.  

click me!