రెండుగా చీలిన వైసీపీ..జగన్ కి షాక్

First Published May 15, 2018, 2:07 PM IST
Highlights

వైసీపీలో వర్గ విభేదాలు

అధికార పార్టీ టీడీపీలో ఇప్పటి వరకు చాలా చోట్ల వర్గ విభేదాలు వచ్చాయి. సొంత పార్టీ నేతలే ఒకరిని మరొకరు బహిరంగంగా విమర్శించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి కూడా ఎదురైంది. విశాఖ జిల్లా పాడేరు నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. సోమవారం చింతపల్లిలో జరిగిన సంఘీభావ పాదయాత్రలో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 

వైసీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు కొయ్యూరులో వైసీపీ సమన్వయకర్త కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ సంఘీభావ యాత్రను నిర్వహించగా, చింతపల్లిలో వైసీపీ సీనియర్‌ నాయకులు, జడ్పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, ఉల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ వెంకటగంగరాజు, ఎంపీటీసీ సభ్యులు సంఘీభావ యాత్ర నిర్వహించారు. పాడేరు సమన్వయకర్త కొట్టిగుళ్లి భాగ్యలక్ష్మి నిర్వహిస్తున్న సంఘీభావయాత్రకు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొనకపోవడం, చింతపల్లిలో పాదయాత్ర నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే వైసీపీ నాయకులు, నూతన సమన్వయకర్త భాగ్యలక్ష్మీకి దూరంగా ఉంటూ పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అలాగే భాగ్యలక్ష్మీ వర్గం కూడా సీనియర్‌ నాయకులను కలుపుకోకుండానే కార్యకలాపాలు చేపడుతున్నారు. సమన్వయకర్తగా భాగ్యలక్ష్మీ నియామకాన్ని పార్టీ సీనియర్‌ నాయకులు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఇంతవరకు ఎక్కడా బహిర్గతం కాలేదు.
 
చింతపల్లిలో జరిగిన సంఘీభావ యాత్రలో చింతపల్లి జడ్పీటీసీ సభ్యురాలు పద్మకుమారి కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ నియామకాన్ని ఐదు మండలాల వైసీపీ సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఆమె నాయకత్వంలో కొనసాగలేక జగన్‌కు మద్దతుగా ఉంటూనే చింతపల్లిలో సంఘీభావ యాత్ర నిర్వహించినట్టు ఆమె తెలిపారు. తాజా పరిణామాల నేపత్యంలో వైసీపీ సీనియర్‌ నాయకులు ఒక వర్గం గాను, నూతనంగా సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించిన భాగ్యలక్ష్మీ మరో వర్గంగాను వైసీపీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పటికీ పార్టీ అధిష్ఠానం కనీసం పట్టించుకోకపోవడం కార్యకర్తలు, పార్టీ అభిమానుల్లో అసహనం వ్యక్తం అవుతున్నది.

click me!