చంద్రబాబుకి జగన్ షాక్... భద్రత మరింత తగ్గింపు

By telugu teamFirst Published Jun 28, 2019, 10:33 AM IST
Highlights

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతను జగన్ ప్రభుత్వం మరింత తగ్గించింది. ఇప్పటికే ఆయన కుమారుడు లోకేష్ జెడ్ ప్లస్ క్యాటగిరిని తగ్గించారు..

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు భద్రతను జగన్ ప్రభుత్వం మరింత తగ్గించింది. ఇప్పటికే ఆయన కుమారుడు లోకేష్ జెడ్ ప్లస్ క్యాటగిరిని తగ్గించారు.. ఇతర కుటుంబసభ్యులకు పూర్తిగా భద్రత తొలగించారు. అంతేకాదు.. చంద్రబాబు వాహనశ్రేణిలో స్థానిక పోలీసులు ఇవ్వాల్సి ఉన్న ఎస్కార్ట్‌, పైలెట్‌ క్లియరెన్స్‌ వాహనాలను తొలగించిన సర్కారు తాజాగా మరోసారి భద్రత కుదింపు నిర్ణయం తీసుకుంది.

చంద్రబాబుకు ఉండే ఇద్దరు ప్రధాన భద్రతా అధికారులను తొలగించటంతో పాటు వీరికి అనుబంధంగా ఉండే ముగ్గురు ఆర్‌.ఐల నేతృత్వంలోని దాదాపు 15 మంది సిబ్బందిని పూర్తిగా తప్పించారు. దీంతో.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు తావిస్తోంది.

గతంలో చంద్రబాబు పదేళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ సమయంలో కూడా ఆయనకు ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, ముగ్గురు ఆర్‌ఐ బృందాలతో చంద్రబాబుకు గత ప్రభుత్వాలు భద్రత కల్పిస్తూ వచ్చాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అందరినీ తొలగించి ఇద్దరేసి కానిస్టేబుళ్లు చొప్పున రెండు బృందాలుగా 2+2గా కేటాయించడం వివాదాస్పదమవుతోంది. 

2003లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మావోయిస్టులు మందుపాతర పేల్చి హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తెలిసిందే. అప్పటి నుంచి ఆయనకు జడ్‌ప్లస్‌ భద్రతతో పాటు ఎన్‌ఎస్‌జీ భద్రత కల్పించారు. ఆతర్వాత అధికారం కోల్పోయినా.. ఇద్దరు సీఎస్‌వోలతో జడ్‌ ప్లస్‌, ఎన్‌ఎస్‌జీ కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ భద్రతను తగ్గిస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు విమర్శలు ఎదురౌతున్నాయి. మరి దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. 

click me!