ఇసుక పాలసీలో మార్పులు... గ్రామ, వార్డు సచివాలయాలకు కీలక బాధ్యతలు

By Arun Kumar PFirst Published Jun 26, 2020, 10:50 AM IST
Highlights

ఇసుక తవ్వకాలు, సరఫరాపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

అమరావతి: ఇసుక తవ్వకాలు, సరఫరాపై తీవ్ర ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉచితంగా ఇసుకను అందించే దిశగా మరో ముందడుగు వేసింది. ఇప్పటివరకు కేవలం ఎడ్లబండ్ల ద్వారా వ్యక్తిగత అవసరాలకు ఇసుకను ఉచితంగా పొందే అవకాశాన్ని కల్పించిన ప్రభుత్వం తాజాగా ట్రాక్టర్ల ద్వారా కూడా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి అనుమతిచ్చింది. ఈ మేరకు ఇసుక పాలసీలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇసుక రీచ్ ల నుండి గృహ అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఉచితంగా పొందేలా ఆదేశించింది జగన్ సర్కార్. ఇలా గృహ నిర్మాణాలు, పునరావాస నిర్మాణాలకు ఉచితంగా ఇసుకను పొందవచ్చని సూచించింది. అయితే ఇందుకోసం ముందస్తుగానే గ్రామ, వార్డ్  సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకోవాలని... వారే ఇలా ఉచితంగా ఇసుకను పొందవచ్చని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. 

read more  ఆన్‌లైన్‌లోనే కాదు గ్రామ సచివాలయాల్లో కూడ ఇసుక బుకింగ్: ఏపీ సర్కార్ నిర్ణయం

ఏపీలో ఇసుక లభ్యత, రవాణా, ధర తదితర అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  డిపోల్లో ఇసుకను అందుబాటులో పెట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. పోర్టల్ నుంచి బల్క్ ఆర్డర్లను తొలగించాలని... పోర్టల్ ఆన్ చేయగానే వెంటనే నిల్వలు అయిపోయాయనే భావన పొగొట్టాలని జగన్ సూచించారు.

 ప్రభుత్వ నిర్మాణాలకు సంబంధించి బల్క్ బుకింగ్ వంటి ఎస్‌సీ, జేసీల ద్వారా అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని సీఎం సూచించారు. చిన్న నదుల నుంచి ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లడానికి స్థానికులను అనుమతించాలని ఆదేశించారు. అయితే పంచాయతీ సెక్రటరీ నుంచి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలన్న ముఖ్యమంత్రి... ఎడ్ల బళ్ల ద్వారా ఇసుకను అక్రమంగా వేరే చోటికి తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

 డిపోల్లో ఇసుకను బాగా అందుబాటులో పెట్టాలన్న జగన్... ఇసుక రీచ్‌ల్లో అక్రమాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటలవరకూ  ఉంచాలని జగన్ సూచించారు. 

click me!