
ఒక ఎన్నికలో బాగా పాపులరైన నినాదం మరో ఎన్నిక ముందు తిరగబడుతోంది. ఇంతకీ అదేంటి అనుకుంటున్నారా ? 2014 ఎన్నికల సమయంలో టిడిపిని అధికారంలోకి రావటానికి అనేక హామీలతో పాటు కొన్ని నినాదాలు కూడా బాగా పనిచేసాయి. జనాల్లోకి ప్రత్యేకంగా యువతను బాగా ఆకట్టుకున్నాయి. అటువంటి నినాదాల్లో ప్రధానమైనది ‘జాబు కావాలంటే బాబు రావాలి’.
రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్ధితుల్లో జరిగిన ఎన్నిక కాబట్టి టిడిపి నినాదాన్ని యువత బాగా నమ్మింది. అయితే, ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీని నిలుపుకున్నారా అంటే సమాధానం అందరికీ తెలిసిందే. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి జరుగుతున్న వ్యవహారం, ఉద్యోగాల కోసం యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనలు అందరూ గమనిస్తున్నదే.
అందుకే పరిస్ధితులను జాగ్రత్తగా గమనించిన వైసీపీ పోయిన ఎన్నికల్లో టిడిపి నినాదాన్ని తాజాగా ఉల్టాగా పాపులర్ చేస్తోంది. ఈ ఉల్టా నినాదం కూడా యువతను బాగానే ఆకర్షిస్తోంది. మంగళవారం వేంపల్లెలో జరిగిన రచ్చబండలో యువత ఉపయోగించటమే అందుకు తాజా ఉదాహరణ. ఇంతకీ వైసీపీ పాపులర్ చేస్తున్న ఉల్టా నినాదమేంటంటే, ‘జాబు రావాలంటే బాబు పోవాలి’. ఎలాగుంది వైసీపీ ఉల్టా నినాదం? మరి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఈ నినాదాన్ని వైసీపీ జనాల్లోకి ఏ స్ధాయిలో తీసుకెళుతుందో చూడాలి.