ఆకర్షణలో జగన్ ప్లాన్ బెడిసికొట్టిందా ?

First Published Feb 3, 2018, 11:46 AM IST
Highlights
  • ప్రధానంగా రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణ జిల్లాల్లోని కమ్మ సామాజికివర్గం నేతలపై జగన్ దృష్టి పెట్టారు.

సామాజిక వర్గాల పరంగా వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వేస్తున్న రాజకీయ ఎత్తుల్లో  ఒకటి పెద్దగా ఫలించటం లేదు. చంద్రబాబునాయుడు సామాజికవర్గానికి చెందిన పలువురు ప్రముఖులను, నేతలను ఆకర్షించాలని జగన్ పెద్ద వ్యూహమే పన్నారు. అందులోనూ ప్రధానంగా రాజధాని జిల్లాలైన గుంటూరు, కృష్ణ జిల్లాల్లోని కమ్మ సామాజికవర్గం నేతలపై జగన్ దృష్టి పెట్టారు. అయితే, తన ప్రయత్నాల్లో పెద్దగా సఫలం కావటం లేదు.

వైసిపిలోకి చేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో పై రెండు జిల్లాలకు చెందిన కొన్ని కమ్మ కుటుంబాలను గుర్తించారు. ఆ కుటుంబాలు కూడా రాజకీయంగా, వ్యాపార, పారిశ్రామికంగా గట్టి స్ధితిలోనే ఉన్నాయి. అందులో కొన్నికుటుంబాలు ప్రస్తుతం ఏ పార్టీలో కూడా లేవు. అటువంటి వారితో వైసిపిలో కీలక నేతల్లో ఒకరైన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మాట్లాడుతున్నారు. వారిలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కూడా ఆఫర్ చేశారట. అయినా ఆ కుటుంబాల నుండి పెద్దగా స్పందన రాలేదట.

ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ త్వరలో ప్రకాశం జిల్లాలో నుండి గుంటూరు, కృష్ణా జిల్లాల్లోకి ప్రవేశిస్తారు. ఆ సమయానికి చెప్పుకోదగ్గ సంఖ్యలో కమ్మ సామాజికవర్గం నేతలను వైసిపిలోకి చేర్చుకోవాలన్న లక్ష్యంతో శేషగిరిరావు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే గుంటూరు జిల్లాలోని రేపల్లె కాంగ్రెస్ మాజీ ఎంఎల్ఏ దేవినేని మల్లికార్జున్ ను సంప్రదించినా ఉపయోగం కనబడలేదు.

ఇదే విషయమై వైసిపిలోని కీలక నేత ఒకరు ‘ఏషియానెట్ ’తో మాట్లాడుతూ, ‘కమ్మ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులెవరూ వైసిపిలో చేరటానికి పెద్దగా ఆసక్త చూపటం లేద’న్నారు. అదే సామాజికవర్గానికి చెందిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం వల్లో లేకపోతే జగన్ పై నమ్మకం లేకో తెలీటం లేదన్నారు. కమ్మ సామాజికవర్గానికి బాగా ప్రాబల్యం కలిగిన గుంటూరు, కృఫ్ణ జిల్లాల్లోనే చంద్రబాబు రాజధాని ఏర్పాటు చేస్తుండటం కూడా చంద్రబాబును వదిలి రావటానికి కమ్మోరులో అత్యధికులు ఇష్టపడటం లేదని కూడా అన్నారు.

ప్రస్తుతం వైసిపిలో కొందరు కమ్మ నేతలున్నప్పటికీ ఆ సంఖ్య చాలదని అభిప్రాయపడ్డారు. అయితే ఎన్నికలు దగ్గరకు వచ్చేటప్పటికి పరిస్దితుల్లో మార్పు వస్తుందని తాము భావిస్తున్నట్లు చెప్పారు. మొత్తానికి ఇప్పటికైతే కమ్మోరిని ఆకర్షించటానికి జగన్ చేస్తున్న ప్రయత్నాలు సక్సెస్ కాలేదన్నది వాస్తవంగా కనబడుతోంది.

 

 

click me!