మోదీ సర్కార్ ను కూల్చే కుట్ర..? చంద్రబాబు అంత పని చేస్తారా..?

By Arun Kumar P  |  First Published Aug 20, 2024, 3:25 PM IST

తెలుగుదేశం పార్టీ మద్దతుతోనే మోదీ మూడోసారి ప్రధాని అయ్యారని అందరికీ తెలుసు. అయితే అదే చంద్రబాబు నాయుడు ఇప్పుడు మోదీని గద్దెదింపే కుట్రల్లో భాగం అవుతున్నారట...  ఇంతకూ భారత ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో చంద్రబాబు ఎలా భాగస్వామ్యం అవుతున్నారు...? 


Narendra Modi : భారత అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యం చేసుకుంటోందా..? అన్ని రంగాల్లో సత్తాచాటుతూ బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుండటం అమెరికాకు నచ్చట్లేదా..? అంటే రష్యా అవుననే అంటోంది. భారత్ లో దశాబ్దకాలంగా బలమైన, స్థిరమైన ప్రభుత్వం వుంది... మరో ఐదేళ్లు కూడా ఎన్డిఏ పాలనే కొనసాగుతుంది. కానీ ఈసాారి పూర్తికాలం కొనసాగకుండా ప్రధాని పీఠంనుండి నరేంద్రమోదీని గద్దెదించేలా, ఎన్డిఏ ప్రభుత్వాన్ని కూల్చేలా అమెరికా కుట్రలు పన్నుతోందట. ఈ మేరకు రష్యా ప్రభుత్వ మీడియా స్పుత్నిక్ ఆసక్తికర కథనాన్ని వెలువరించింది. 

స్పుత్నిక్ కథనం ప్రకారం... భారత్ ప్రస్తుతం చాలా బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. గత పదేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డిఏ ప్రభుత్వం దేశాన్ని అభివృద్ది దిశగా నడిపింది. అయితే ఇదే సమయంలో భారత్ అనుసరిస్తున్న విదేశాంగ విధానం ప్రపంచ దేశాలపై ఆధిపత్యం ప్రదర్శించే అమెరికాకు మింగుడుపడటం లేదట. అందువల్లే మరో ఐదేళ్లపాటు మోదీ ప్రభుత్వాన్ని కొనసాగనివ్వకూడదని అమెరికా ప్రయత్నిస్తోందని రష్యా ఆరోపిస్తోంది. అమెరికా నిఘా సంస్థ సిఐఏ తెరవెనక పెద్ద కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణ చేస్తోంది స్పుత్నిక్.  

Latest Videos

గతంలో బిజెపికి స్పష్టమైన మెజారిటీ రావడంతో మోదీ ప్రభుత్వాన్ని ఎవరూ టచ్ చేయలేకపోయారు. కానీ ఇప్పుడలా కాదు... ఎన్డిఏ కూటమిలో బిజెపికి అత్యధిక సీట్లు వున్నా ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా  లేవు. దీంతో మిత్రపక్షాలైన తెలుగుదేశం, జేడియు మద్దతు తప్పనిసరి అయ్యింది. ఇదే ఇప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలకు కారణమయ్యిందట... ప్రతిపక్షాలతో పాటు ఎన్డిఏలో కీలకమైన టిడిపి సహకారంతో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు సహకారంతో మోదీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రలు పన్నుతున్నారని స్పుత్నిక్ పేర్కొంది. 

ఇటీవల మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో అల్లర్లకు, రాజకీయ సంక్షోభానికి, షేక్ హసీనా ప్రభుత్వం కూలడానికి అమెరికా కారణమంటూ ఆరోపణలు వచ్చాయి. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా బంగ్లాదేశ్ లో ప్రస్తుత పరిస్థితికి అమెరికాయే కారణమంటూ పేర్కొన్నాయి. తాజాగా ఇలాంటి కుట్రే భారత్ పైనా జరుగుతోందంటూ రష్యా పత్రిక స్పుత్నిక్ కథనం ఆందోళన కలిగిస్తోంది. అమెరికా రాయబారితో పాటు కొందరు అధికారులు పదేపదే ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం కావడమే అనుమానాలకు తావిస్తోందని స్పుత్నిక్ పేర్కొంది.  

త్వరలోనే మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉందని రష్యా మీడియా పేర్కొంది. ఇందుకోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయట. ప్రతిపక్ష నేతలతో నిత్యం టచ్‌లో ఉన్న అమెరికా గూఢచార సంస్థ సీఐఏ.. ఇప్పటికే కొందరు నేతలతో సమావేశమై చర్చలు జరిపినట్లు పేర్కొంది. అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సెన్ ఇటీవల హైదరాబాద్‌లో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కలిశారు. అంతకు ముందు ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా కలిశారు. ఈ ఘటనలన్నింటినీ రష్యా మీడియా తన నివేదికల్లో పేర్కొంది. హైదరాబాద్‌లోని అమెరికన్ మిషన్ ఆర్గనైజేషన్‌కు లార్సన్ నాయకత్వం వహిస్తున్నాడని... ఈ సంస్థ ద్వారా బాప్టిస్ట్ చర్చి సహాయం పొందేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ ప్రయత్నిస్తోందని నివేదిక పేర్కొంది.

కొంతమంది ప్రతిపక్ష నేతలతో సీఐఏ నిరంతరం టచ్ లో ఉందని...  వీరితో కలిసి మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో అపనమ్మకం సృష్టించేలా పరిస్థితులు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని స్పుత్నిక్ పేర్కొంది. చంద్రబాబు నాయుడు మద్దతును పొందడమే సిఐఏ లక్ష్యంగా పెట్టుకుందట. బాప్టిస్ట్ చర్చి ద్వారా చంద్రబాబును తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఎన్డిఏ కూటమికి టిడిపి మద్దతు ఉపసంహరించుకునేలా పావులు కదుపుతున్నారట. అందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించాలని విపక్షాలకు సూచించినట్లు రష్యా మీడియా పేర్కొంది. ఇందుకోసమే అమెరికా కాన్సుల్ జనరల్, దౌత్యవేత్తలు ప్రతిపక్ష నేతలతో సమావేశం అవుతున్నారని పేర్కొన్నారు. 

మోదీ వ్యతిరేక నేతలు, సామాజిక కార్యకర్తలు, సోషల్ మీడియా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, కళాకారులతో సహా చాలా మందిని అమెరికా ఉపయోగించుకుంటోందని రష్యా చెబుతోంది. యుఎస్ ఎంబసీ భారతదేశంలో 'ఇన్‌ఫ్లూయెన్స్ టు ఇంపాక్ట్' అనే కార్యక్రమాన్ని నిర్వహించింది... అభిషేక్ బెనర్జీని ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన విషయాన్ని స్పుత్నిక్ గుర్తుచేసింది. యూట్యూబ్ తో పాటు సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఈయనను ఆహ్వానించడం అనుమానాలకు తావిస్తోందని స్పుత్నిక్ పేర్కొంది. 

భారతదేశంలో ఉంటూ హిందూ పండుగలు, ఆచార వ్యవహారాలు, దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడి, భారత వ్యతిరేక వైఖరితో మాట్లాడిన ఆర్జే సైమాకు అమెరికా రాయబార కార్యాలయం 'సమానత్వ అంబాసిడర్' బిరుదును ఇచ్చి గౌరవించిందని స్పుత్నిక్ పేర్కొంది. ఇదంతా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారత ప్రజలను రెచ్చగొట్టే పక్కా ప్రణాళికతో కూడిన కుట్రలో భాగమేనని స్పుత్నిక్ చెబుతోంది.

click me!