రాజీనామాల యోచనలో ఫిరాయింపులు...చంద్రబాబుకు షాక్

First Published Feb 20, 2018, 4:00 PM IST
Highlights
  • కర్నూలు జిల్లా కోడుమూరు ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధి చేసిన సంచలన ప్రకనటపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఫిరాయింపు ఎంఎల్ఏలు చంద్రబాబునాయుడు షాక్ ఇవ్వనున్నారా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. వైసిపి తరపున గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపిలు టిడిపిలోకి ఫిరాయించారు. ఫిరాయించిన వాళ్ళంతా వివిధ ప్రలోభాలకు గురయ్యే పార్టీ ఫిరాయించినట్లు ఆరోపణలున్నాయి. ఫిరాయింపుల స్ధాయిని బట్టి, అవసరాన్ని బట్టి వారికి మంత్రిపదవులు, కాంట్రాక్టులు, డబ్బు, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు ప్లస్ ఎన్నికల ఖర్చులు ఇలా.. రకరకాలుగా ప్రలోభాలకు గురిచేశారట.

ఇదంతా వైసిపి నేతలు చేస్తున్న ఆరోపణలే కాకుండ జనాల్లో కూడా ఇదే విధమైన చర్చ జరుగుతోంది. ఇటువంటి నేపధ్యంలో కర్నూలు జిల్లా కోడుమూరు ఫిరాయింపు ఎంఎల్ఏ మణిగాంధి చేసిన సంచలన ప్రకనటపై ఇపుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తాను డబ్బుకు అమ్ముడు పోయినట్లు చెప్పారు. అంతేకాకుండా పలువురు ఫిరాయింపులు టిడిపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు చెప్పారు. మణిగాంధి ప్రకటన ఒక విధంగా చంద్రబాబుకు షాక్ కొట్టిందనే చెప్పాలి.

టిడిపిలోకి ఫిరాయించి రాజకీయ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్లు గాంధి చెప్పారు. తనలాగే బద్వేలు ఎంఎల్ఏ జయరాములు కూడా ఫీలవుతున్నట్లు చెప్పటం సంచలనంగా మారింది. వీరిద్దరే కాదు ఇంకా చాలా మంది అదే భావనతో ఉన్నారట. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు ఎంఎల్ఏ అశోక్ రెడ్డి, పాడేరు ఎంఎల్ఏ గిడ్డి ఈశ్వరి, అనంతపురం జిల్లాలోని కదిరి ఎంఎల్ఏ చాంద్ భాష తదితరులు టిడిపిలో ఇమడలేకపోతున్నారట.

పాడేరు ఎంపి కొత్తపల్లి గీత కూడా టిడిపిలో ఇమడలేకపోతున్నట్లు చెప్పిన విషయం గమనార్హం. మణిగాంధి చెప్పిన ప్రకారం చూస్తుంటే త్వరలోనే పలువురు ఫిరాయింపులు టిడిపికి రాజీనామాలు చేయటం ఖాయమని అర్ధమవుతోంది. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబుకు ఒక విధంగా ప్లస్ మరో విధంగా మైనస్.

click me!