
ఇటీవలే ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. అంతా సవ్యంగా సాగిపోయింది, ఎలాంటి సమస్యలూ ఎదురుకాలేదని ఆనందపడుతున్న సమయంలో ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు వెలుగులోకి వస్తున్నాయి. అలాగే ఇద్దరు మంత్రులకు వివాదాల్లో చిక్కుకున్నారు. ఈ విషయాలన్నీ పార్టీ హైకమాండ్ కు తలనొప్పిగా మారాయి.
కొత్తగా మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి, వైసీపీలో నెంబర్ 2 గా భావించే విజయసాయి రెడ్డిని స్థానిక నాయకులు ఇటీవల పట్టించుకోకపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతోంది. ఓ కేబినేట్ మినిస్టర్ కు, పార్టీ పెద్దకు గౌరవం ఇవ్వకపోవడం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.
ఇటీవల మంత్రి పదవి చేపట్టిన తరువాత మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఆదివారం పర్యటించారు. అయితే ఈ పర్యటనలో ఆయనకు సొంత పార్టీ నుంచే అసమ్మతి సెగ తగిలింది. ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంతో మంది ప్రజా ప్రతినిధులు వచ్చారు. కానీ ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు అయిన, అదే జిల్లాకు చెందిన ముఖ్య నాయకులు మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కనిపించలేదు. పైగా అదే సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ సభ ఏర్పాటు చేశారు. తన బలం ఏంటో నిరూపించుకున్నారు.
మంత్రి కాకాణి వివాదంలో కూడా చిక్కుకున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫోర్జరీ కేసు పెట్టారు. అయితే ఈ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. కాకాణి మంత్రి అయిన వెంటనే ఆ కేసుకు సంబంధించి పేపర్స్ కనిపించకుండా పోయాయి. తాజాగా గుంటూరు జిల్లాలో ఆయనకు ఉన్న విల్లాలో ఓ ముస్లిం యువకుడు చనిపోయి కనిపించాడు. అతడు విద్యుద్ఘాతానికి గురై చనిపోయారని చెబుతున్నా.. మృతుడి కుటుంబీకులు మాత్రం ఇది హత్యనేని ఆరోపిస్తున్నారు. ఈ రెండు విషయాలు ఇప్పుడు కాకాణి గోవర్ధర్ రెడ్డి మెడకు చుట్టుకున్నాయి.
ఇదిలా ఉండగా.. మొన్నటి మంత్రి వర్గ విస్తరణలో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఉషశ్రీ చరణ్ కూడా ఓ వివాదంలో చిక్కుకున్నారు. గత శుక్రవారం ఆమె అనంతపురంలో పర్యటించారు. అయితే ఈ పర్యటన సమయంలో ఆమె క్యాన్వాయ్ కు దారి ఇచ్చేందుకు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ట్రాఫిక్ ను మొత్తం నిలిపివేశారు. అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కు వెళ్తున్న ఓ చిన్నారి ఈ ట్రాఫిక్ లో చిక్కుకుంది. ఎంత సేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో ఆ పాప పరిస్థితి విషమించి చనిపోయింది. ఈ ఘటనపై ఆమె కనీసం స్పందించలేదు. ఈ పరిణామం రాష్ట్ర వ్యాప్తంగా ఆమెను విమర్శల పాలయ్యేలా చేసింది.
మరోవైపు వైసీపీలో కీలక నాయకుడు అయిన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా తాజాగా అసమ్మతి కనిపించింది. ఆయన తిరుపతిలో జాబ్ మేళా నిర్వహించేందుకు మూడు రోజుల పాటు పద్మావతి గెస్ట్ హౌస్ లో స్టే చేశారు. అంత పెద్ద స్థాయి నాయకుడిని కలవడానికి చిత్తూరు జిల్లా నాయకులెవరూ రాలేదు. పలకరించలేదు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం కే. నారాయణస్వామి తిరుపతి ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్ కు వచ్చారు. కానీ విజయసాయి రెడ్డిని కనీసం వచ్చి కలవలేదు. అలాగే తిరిగి వెళిపోయారు.
కాగా మంత్రి ఆదిమూలపు సురేశ్ ఆదివారం తిరుపతి వచ్చారు. అయితే ఆయనను కలవడానికి స్వయంగా ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రావడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ పార్టీ హైకమాండ్ కు తల నొప్పిగా మారాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాటలు భవిష్యత్ లో తీరని నష్టం కలిగించేలా ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు.