
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఇంటర్ విద్యార్థిని ఒకరు బిల్డింగ్ మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గత కొంతకాలంగా తీవ్ర మానసిక వేదనతో కాలేజీకి వెళ్లడం మానేసిన ఆ యువతి సోమవారం ఉదయం కాలేజీ నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. విజయవాడలోని అంబాపురానికి చెందిన ఈ అమ్మాయి క్లాసులో టాపర్.
ప్రస్తుతం ఇంటర్ సెకండియర్ చదువుకుంటుంది. గత కొంతకాలంగా ఇంటి దగ్గర ఉన్న ఓ అబ్బాయి ప్రేమలో పడింది. ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యకు ప్రయత్నించింది. తాను అతడిని ప్రేమిస్తే ఆ యువకుడు మరో అమ్మాయిని ప్రేమిస్తున్నాడని గత కొంతకాలంగా ఇంటర్ విద్యార్థిని మనస్థాపానికి గురైంది. ఏపీలోని విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటన కాలేజీలో కలకలం సృష్టించింది.
ఏపీలో రిజిస్ట్రేషన్లు ఇక సులువు.. ఈ నెల 31 నుంచి కొత్త సాఫ్ట్‌వేర్, ఆన్‌లైన్‌లోనే మొత్తం ప్రక్రియ
కొంతకాలంగా కాలేజీకి దూరంగా ఉన్న ఆ అమ్మాయి సోమవారం ఉదయం ఆరు గంటలకి మార్నింగ్ వాకర్స్ తో పాటు కాలేజీలోకి వచ్చింది. మామూలుగా కాలేజీ సమయం ఉదయం 8:00 గంటలు. ఆ తర్వాత కాసేపటికే కాలేజీ నాలుగవ అంతస్తు మీదకి వెళ్లి అక్కడ నుంచి దూకేసింది.
తమతో పాటు వచ్చిన అమ్మాయి దూకడం గమనించిన వాకర్స్ వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. నాలుగు అంతస్తుల మీద నుంచి దూకడంతో ఆ యువతి కోమాలోకి వెళ్ళింది. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు 24 గంటలు గడిస్తే కానీ పరిస్థితి చెప్పలేమంటున్నారు.
ఇంట్లో ఆ విద్యార్థిని రాసిన 11పేజీల సూసైడ్ నోట్ లభించింది. అందులో ఆ అమ్మాయి తాను ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానో వివరించింది. ‘నేను ప్రేమలో విఫలమయ్యాను.. నేను ప్రేమించిన వ్యక్తి మరో యువతిని ప్రేమిస్తున్నాడు. దీంతో నాకు చదువుపై ఆసక్తి తగ్గిపోయింది. ఇంట్లో వాళ్ళు నా తప్పు ఏమీ లేకపోయినా కూడా నన్నే నిందిస్తున్నారు’ అంటూ తన ఆవేదననంతా లెటర్ లో రాసింది.
చివరికి ఆ లేఖలో,, ‘నన్ను ఇబ్బంది పెట్టిన వారిని నేను ఊరికే వదలను. చనిపోయిన తర్వాత దయ్యమై పట్టిపీడిస్తాను’ అంటూ హెచ్చరించింది. యువతి ఆత్మహత్య ప్రయత్నం మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సూసైడ్ లెటర్ ను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు.