
ఇంతకీ రాజమౌళి హోదా ఏంటి? అందరికీ తెలిసిందేంటంటే సినిమా దర్శకుడు మాత్రమే. అమరావతి నిర్మాణానికి రూపొందిస్తున్న డిజైన్లపై చర్చించేందుకు ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ను కలవటానికి త్వరలో లండన్ వెళుతున్నారు. ఇదే విషయమై చంద్రబాబునాయుడుతో కూడా రాజమౌళి బుధవారం మూడుసార్లు కలిసి చర్చించారు. మామూలుగా అయితే, రాజమౌళి 5 కోట్ల ఆంధ్రుల్లో ఒకరు. వృత్తిరీత్యా సినిమా దర్శకుడు అంతే. రాజధానికి సంబంధించి ఆయనకేమీ సంబంధం లేదు.
అటువంటిది ఏ హోదాలో రాజమౌళి అమరావతి డిజైన్ల గురించి చంద్రబాబుతో చర్చిస్తున్నారు? బ్రిటన్ వెళ్ళి నార్మన్ ఫోస్టర్ ను కలువబోతున్నారు? చంద్రబాబు అనుకుంటే దారినపోయే ఏ దానయ్యతోనైనా అమరావతిపై చర్చించవచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ ఏకంగా లండన్ వెళ్ళి ఆర్కిటెక్ట్ ఫోస్టర్ ను కలిసి చర్చలు జరపాలంటే మాత్రం రాజమౌళికి ఏదో ఓ హోదా ఉండితీరాలి. ఇంతచిన్న విషయం చంద్రబాబుకైనా రాజమౌళికి తెలీదని అనుకోలేం.
ఆ విషయం మీదనే రెండు రోజులుగా రాష్ట్రంలో చర్చలు జరుగుతున్నాయ్. అందుకనే రాజమౌళికి కూడా స్పందించారు. తాను అమరావతి నిర్మాణానికి సంబంధించి కన్సల్టెంట్ గానీ, డిజైనర్ గానీ లేదా సూపర్ వైజర్ కూడా కానంటూ ఓ ట్వీట్ చేసారు. మరి ఏం కాకపోతే లండన్ వెళ్ళి ఆర్కిటెక్ట్ తో ఏ హోదాలో సలహాలు, సూచనలు ఇవ్వనున్నారో కూడా చెబితే బాగుంటుంది కదా?