మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి సోనియాగాంధీ ఫోన్: పీసీసీ చీఫ్ పదవిపై ఏమన్నారంటే......

By Nagaraju penumalaFirst Published Nov 21, 2019, 9:21 PM IST
Highlights

తిరుపతిలో మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎందో భాదేస్తుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. 
 

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ అధ్యక్షుడిగా తనను నియమిస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పుకొచ్చారు కాంగ్రెస్‌ నేత, మాజీ సీఎం నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి. పీసీసీ చీఫ్ పదవి తనకేనంటూ వస్తున్న వార్తలు కేవలం మీడియా సృష్టేనన్నారు. 

తిరుపతిలో మీడియాతో తన మనసులోని మాటలు పంచుకున్నారు. తనకు పీసీసీ చీఫ్ పదవిపై అంతగా ఆసక్తి లేదని తేల్చి చెప్పేశారు. ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే ఎందో భాదేస్తుందన్నారు కిరణ్ కుమార్ రెడ్డి. 

రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తికి గురి చేస్తున్నాయని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతిలో తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించానని గుర్తు చేశారు. 

తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సాగు, తాగునీరు ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. చిత్తూరు జిల్లాకు అంతర్జాతీయ స్టేడియం ఇప్పటి వరకు రాకపోవడం బాధనిపిస్తోందన్నారు. 

ఈ పరిణామాలు అన్నింటిని చూసి తనకు రాజకీయాలపట్ల అసంతృప్తి వచ్చేసిందన్నారు. ఇకపోతే ఏపీ పీసీసీ చీఫ్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ హైకమాండ్‌ నుంచి పిలుపు వచ్చిందంటూ ప్రచారం జరిగింది. 

ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డితో ఫోన్‌లో మాట్లాడారంటూ ప్రచారం కూడా జరిగిపోయింది. రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ ఉమెన్‌చాందీ కిరణ్‌ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించారని అందువల్లే సోనియాగాంధీ ఆమోదముద్రవేసినట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. 

సోనియాగాంధీ ఆదేశాలతో కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలన్నీ అసత్యాలేనని కొట్టిపారేశారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. తనకు పీసీసీ చీఫ్ పదవిపట్ల ఆసక్తి లేదంటూ చేతులెత్తేశారు.  

 

click me!