మద్యం మత్తు.. భార్యను, అత్తను వేట కొడవలితో నరికి చంపిన భర్త..

By SumaBala BukkaFirst Published Jan 28, 2023, 6:50 AM IST
Highlights

ఓ వ్యక్తి పిల్లలముందే అత్తను, భార్యను వేటకొడవలితో నరికి చంపాడు. మద్యం మత్తులో భార్యతో గొడవ పడిన ఆ వ్యక్తి ఇంత దారుణానికి ఒడిగట్టాడు. 

కర్నూలు : ఆంధ్ర ప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో  దారుణ ఘటన జరిగింది. మద్యం మత్తులో ఏం చేస్తున్నాడో తెలియక.. విపరీతమైన కోపం, ద్వేషంతో  విచక్షణ మరిచిపోయి.. కట్టుకున్న భార్యను,  పిల్లనిచ్చిన అత్తను ఓ వ్యక్తి  అత్యంత కిరాతకంగా వేటకొడవలితో నరికి చంపాడు. ఒళ్ళుగగుర్పొడిచే ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు జిల్లా పెదకడపూరు మండలం జాలవాడిలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెద్దకడబూరు మండలం జాలవాడి స్థానికుడు కురవ నాగరాజు.  అతనికి ఆదోనికి చెందిన కురవ భీమక్క అలియాస్ లక్ష్మమ్మ కుమార్తె శాంతినిచ్చి 12 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. వీరికి ఓ కుమార్తె,  ఇద్దరు కొడుకులు సంతానం. నాగరాజు కరెంట్ పని చేస్తుంటాడు.  ఇటీవల కాలంలో మద్యానికి అలవాటు పడ్డాడు. తరచుగా తాగి వచ్చి భార్యతో గొడవ పడేవాడు. మద్యం కారణంగా పనులు లేకపోవడంతో డబ్బులకు ఇబ్బంది..  పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని వేధింపులకు గురి చేసేవాడు.

తారకరత్నకు గుండెపోటు.. పవన్ కల్యాణ్ విచారం, త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష

ఈ వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం శాంతి పుట్టింటికి వెళ్ళిపోయింది. 20 రోజులైనా తిరిగి రాకపోవడంతో నాగరాజు  శాంతి కోసం అత్తగారింటికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తన సోదరిని కష్టాలు పెడుతున్నావని బావమరుదులు నిలదీయడంతో వారిని ఒప్పించి భార్యను వెనక్కి తీసుకొచ్చాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత అతడి ప్రవర్తన ఎప్పటి మాదిరిగానే ఉంది. మళ్లీ తాగి వచ్చి శాంతిని వేధించడం మొదలు పెట్టాడు,

ఈ క్రమంలోనే నాగరాజు, శాంతిల కూతురికి ఆటలమ్మ సోకింది.  శుక్రవారం అనారోగ్యం బారిన పడిన మనమరాలిని చూడడానికి శాంతి తల్లి భీమక్క జాలవాడికి కూతురు దగ్గరికి వచ్చింది. అయితే రోజులాగానే నాగరాజు.. తాగి వచ్చి భార్యతో గొడవ పడడం మొదలుపెట్టాడు. అది చూసిన భీమక్క ఎందుకయ్యా సతాయిస్తావ్ అంటూ అల్లుడిని మందలించింది. దీంతో మాటా మాటా పెరిగింది.

అసలే మద్యం మత్తు.. దానికి తోడు అత్తమందలించడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు దగ్గర్లోని వేట కొడవలితో భార్య శాంతి మీద  దాడి చేశాడు. అది చూసిన పిల్లలు  భయాందోళనలకు గురయ్యారు. కూతురి మీద దాడి చేయడం గమనించిన భీమక్క అల్లుడిని అడ్డుకోబోయింది. ఆమెను కూడా వేట కొడవలితో నరికాడు. వెంటనే తీవ్ర గాయాలతో ఇద్దరు అక్కడికక్కడే రక్తపు మడుగులో పడి చనిపోయారు. 

ఈ గలాటాకు అక్కడికి వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకునేసరికి నాగరాజు పారిపోయాడు. అనుకోని హఠాత్పరిణామానికి షాక్ అయి.. బిక్కు బిక్కుమంటున్న పిల్లలను పోలీసులు ప్రశ్నించగా.. తల్లిని, అమ్మమ్మని తండ్రి  నరికి చంపినట్లు తెలిపారు. వారి వాంగ్మూలం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టారు. 

click me!