
అది 2009 సెప్టెంబర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతిచెందారు. ఆ తర్వాత రోజే కాంగ్రెస్ అధిష్టానం.. అప్పటి కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్యను (Konijeti Rosaiah) ముఖ్యమంత్రిగా నియమించింది. అయితే అప్పటికే వైఎస్సార్ కుమారుడు వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని ఓ వర్గం నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అయితే రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే కర్నూలు, మహబూబ్ నగర్, కృష్ణా, గుంటూరు, నల్గొండ జిల్లాలను వరదలు (AP Floods 2009) ముంచెత్తాయి. దాదాపు 25 వేల మంత్రి ప్రజలు వరదల్లో చిక్కుకుపోయారు.
హంద్రీ, తుంగభద్ర నదుల వరద నీటివల్ల కర్నూలు పట్టణంలో వందల ఇండ్లు మునిగిపోయి వేలాది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఎటూ చూసిన వరదే కనిపించింది. మంత్రాలయంలోకి నీరు చేరింది. ప్రాణ నష్టం, భారీగా ఆస్తి నష్టం జరిగింది. శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల ముంపు సమస్య మరింతగా పెరిగింది. ఈ పరిస్థితులను చూసి ప్రజలు భీతిల్లిపోయారు.
అయితే అప్పటికి రోశయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి కేవలం నెల రోజులు మాత్రమే అయింది. కానీ తనకున్న అపూర్వ రాజకీయ అనుభవంతో రోశయ్య ఈ సంక్షోభాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అన్నీ తానై అధికార యంత్రాగాన్ని ముందుకు నడిపించారు. ముఖ్యమంత్రి రోశయ్య.. కర్నూలు వరదలను పరిశీలిస్తూ సచివాలయంలోనే బస చేశారు. అధికారులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీచేశారు. రోశయ్య అవలంభించిన విధానాలు.. వరద నష్టాన్ని తగ్గించడంలో సహాయపడ్డాయి. రోశయ్య ఈ సంక్షోభాన్ని ఎదుర్కొన్న తీరుపై కాంగ్రెస్ అధిష్టానం కూడా ప్రశంసలు కురిపించింది. అయితే ఆ తర్వాత వైఎస్ జగన్‌ను సీఎంగా చేయాలనే ఆయన మద్దతుదారుల ప్రతిపాదన వెనక్కి తగ్గింది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన..
కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని వరద బాధిత ప్రాంతాల్లో రోశయ్య మూడు రోజుల పర్యటించారు. అక్కడ బాధితులను అడిగి ఆయన సమస్యలు తెలుసుకున్నారు. అయితే ఈ సందర్బంగా కొందరు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా ఆయన కాన్వాయ్‌పై రాళ్లు కూడా విసిరారు. అయితే ఇదంతా ఓ వర్గం కావాలనే చేసిందని కాంగ్రెస్‌లో రోశయ్యకు మద్దతుగా ఉన్న నాయకులు ఆరోపించారు. ఏది ఏమైనా తన అనుభవంతో రోశయ్య ఆ వరదల సమయంలో చాలా పనిచేసినట్టుగా కాంగ్రెస్ అధిష్టానం గుర్తించింది. వరద ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. ముఖ్యమంత్రిగా రోశయ్య విపత్తు నిర్వహణపై ప్రశంసలు కురిపించారు
Also read: Konijeti Rosaiah Death: తెలంగాణలో మూడు రోజులు సంతాప దినాలు.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
రోశయ్య కన్నుమూత..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah Death) ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం ఉదయం ఆయన పల్స్ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్తుండగానే ఆయన మార్గమధ్యలో మృతిచెందారు. ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో రోశయ్య కీలక బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2009 సెప్టెంబర్ 3 నుంచి 2011 జూన్ 25 వరకు రోశయ్య ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత రోశయ్య.. తమిళనాడు గవర్నర్‌గా పనిచేశారు. పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.