వాళ్లలా కాదు, రా... రా.. అని చర్చకు పిలుస్తున్నాం: మంత్రి అనిల్ సెటైర్లు

By Siva KodatiFirst Published Jul 15, 2019, 1:05 PM IST
Highlights

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రాజెక్ట్‌లో అంచనా వ్యయాన్ని టీడీపీ ప్రభుత్వం విపరీతంగా పెంచిందంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. 

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏపీ అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ప్రాజెక్ట్‌లో అంచనా వ్యయాన్ని టీడీపీ ప్రభుత్వం విపరీతంగా పెంచిందంటూ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.

తాము ఏం మాట్లాడుతున్నా.. ఏం చెబుతున్నా ప్రతిపక్ష సభ్యులు అసత్యం అంటున్నారని దీనిపై ఏమనాలో తెలియడం లేదని కొత్త పదాలు కావాలంటూ ఆయన సెటైర్లు వేశారు. మాకు ఏది ఉంచుకునే అలవాటు లేదని.. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్లకు ఇచ్చేస్తామంటూ అనిల్ కుమార్ నవ్వుల పువ్వులు పూయించారు.

సీఎం రమేశ్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్‌కు అంచనాలు పెంచి ఇరిగేషన్ పనులు ఇచ్చారని అనిల్ కుమార్ ఆరోపించారు. అలాగే యనమల వియ్యంకుడికి పోలవరంలో అప్పనంగా పనులు అప్పగించారని ఎద్దేవా చేశారు. 

ఐదేళ్లలో టీడీపీ నేతలు ఏం చేయలేదని.. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రూ. 5,400 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో పెట్టారని  గుర్తు చేశారు. సాగునీటి రంగంపై తాము నియమించిన కమిటీ ఇచ్చే నివేదికను అనుసరించి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాలా లేక మరేదైనా చర్యలు చేపట్టాలా అనేది నిర్ణయిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

25 వేల కుటుంబాలను పునరావాస జాబితాలో తమ ప్రభుత్వం చేర్చిందన్నారు. పోలవరంలో శిలాఫలకాలు తప్పించి ఏ పని జరగలేదని అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. దీనిపై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కౌంటరిచ్చారు.

38 సంవత్సరాల రాజకీయ జీవితంలో తాను ఏనాడు మాట పడలేదని.. సున్నా వడ్డీల వ్యవహారంలాగే పోలవరం విషయంలోనూ అధికార పక్షం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు.

దీనిపై ప్రతిపక్షనేత చంద్రబాబు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ 71.4 శాతం పూర్తయ్యిందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి స్పీల్‌వే కోసం కూడా భూసేకరణ జరగలేదన్నారు. 
 

click me!