పరువు హత్య: కూతుర్ని చంపి బూడిద చేసిన తండ్రి

By telugu teamFirst Published Oct 20, 2019, 10:29 AM IST
Highlights

చిత్తూరు జిల్లాలో తండ్రి కూతురిని చంపేసి, శవాన్ని పొలంలో కాల్చేసి, బూడిద చేశాడు. దళితుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో, పరువు పోతుందని భావించి రెడ్లపల్లెలో చందనను తండ్రి మట్టుబెట్టాడు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో సంచలనం సృష్టించిన మిస్టరీ మృతి చిక్కుముడి వీడింది. రెడ్లపల్లి చందనది హత్యేనని పోలీసులు తేల్చారు. కులాంతర వివాహం చేసుకుందనే కోపంతో పరువు పోతుందని భావించి కన్నతండ్రే ఆమెను హత్య చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను డిఎస్పీ అందించారు. 

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం రెడ్లపల్లెకు చెందిన చెందిన చందన (17), ఒడ్డుమడి గ్రామానికి చెందిన ప్రభు అలియాస్ నందకుమూర్ (18) డిగ్రీ చదువుతున్న సమయంలో ప్రేమించుకున్నారు. ప్రభు దళిత వర్గానికి చెందినవాడు కావడంతో చందన తల్లిదండ్రులు మందలించారు. దాంతో చందన, నందకుమార్ పారిపోయి కుప్పంలోని తిరుపతి గంగమాంబ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. 

ఆ విషయం తెలుసుకున్న చందన తండ్రి వెంకటేశ్ బంధువులతో కలిసి కుప్పం వెళ్లి వారిద్దరిని తీసుకుని వచ్చాడు. నందకుమార్ ను వారింటికి పంపించి, చందనతో తనతో తీసుకుని వెళ్లాడు. ఇంటికి వెళ్లిన తర్వాత చందనను చితకబాదాడు. తన అన్న వరమూర్తి కూతురు కూడా అదే విధంగా కులాంతర వివాహం చేసుకుని అవమానపరిచిందనే ఆవేశంతో చందన గొంతుకు తాడు బిగించి హత్య చేశాడు. 

దాన్ని కప్పిపుచ్చేందుకు భార్య అమరావతితో కలిసి ఇంట్లో దూలానికి ఉరి వేసుకున్నట్లు చిత్రీకరించాడు. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించాడు. అన్న వరమూర్తి, అతని కుమారుడు వెంకటాద్రి, బావమరిది మునిరాజులతో కలిసి రాత్రికి రాత్రే చందన మృతదేహాన్ి తన సొంత పొలంలోనే కాల్చి బూడిద చేశాడు. బూడిదను సంచుల్లోకి ఎత్తి తీసుకుని వెళ్లి క్యానంబళ్ల చెరువులో పడేశాడు. 

అయితే, ఆ విషయం వెలుగు చూడడంతో వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు సాగించారు. శనివారం రెడ్లపల్లెలో వెంకటేశ్, అమరావతి, వరమూర్తి, మునిరాజులను అరెస్టు చేశారు. వెంకటాద్రి మాత్రం పరారీలో ఉన్నాడు. నిందితులను డిఎస్పీ మీడియా ముందు ప్రవేశపెట్టారు.

click me!