మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజున మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి అధిష్టానం నిర్ణయం షాకిచ్చింది
మున్సిపల్, కార్పోరేషన్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈరోజున మేయర్, డిప్యూటీ మేయర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు అభ్యర్ధులను ప్రకటించింది.
అయితే పదవులపై ఆశలు పెట్టుకున్న వారికి అధిష్టానం నిర్ణయం షాకిచ్చింది. దీంతో పదవులు దక్కని ఆశావహులు అధినాయకత్వంపై మండిపడుతున్నారు. కొందరైతే నిరసనలకు దిగుతున్నారు.
undefined
ఈ నేపథ్యంలో విశాఖలోని జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మేయర్ రేసులో వున్న వంశీ కృష్ణ శ్రీనివాస్‌కు మేయర్ పదవి దక్కకపోవడంతో వైసీపీ అభిమానులు, ఆయన అనుచరులు భగ్గుమన్నారు.
పార్టీ వైఖరిని నిరసిస్తూ జీవీఎంసీ ప్రధాన కార్యాలయాన్ని శ్రీనివాస్ మద్ధతు దారులు ముట్టడించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు.
అంతకుముందు గ్రేటర్ విశాఖ మేయర్ గా మహిళ బాధ్యతలు స్వీకరించారు. విశాఖ తూర్పు నియోజకవర్గానికి చెందిన గొలగాని వెంకట హరి కుమారి విశాఖ మేయర్ గా భాద్యతలు స్వీకరించారు.
చివరి నిమిషం వరకు మేయర్ అభ్యర్థి ఎవరు అన్నదానిపై ఉత్కంఠ కొనసాగింది. ప్రమాణ స్వీకారానికి కొన్ని నిమిషాల ముందే ఎంపీ విజయసాయిరెడ్డి గొలగాని హరి వెంకట కుమారిని మేయర్ గా ప్రకటించారు.
కాసేపటికే ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. విశాఖ అభివృద్ధికి మరింత కృషి చేస్తామన్నారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చిన సీఎం జగన్, ఎంపీ విజయసాయి రెడ్డికి ఆమె ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ మహిళా మేయర్ గా గతంలో రాజాన రమణి చేశారు. రెండో మహిళ మేయర్ గా హరి కుమారి నిలిచారు. అయితే ప్రభుత్వం విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించడంతో.. పరిపాలన రాజధానిలో తొలి మేయర్ పీఠం మహిళ కైవసం చేసుకునట్టు అయ్యింది.