ఆంధ్రా యూనివర్సిటీని తాకిన మోడీ డాక్యుమెంటరీ సెగ.. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధుల మధ్య ఘర్షణ

By Siva KodatiFirst Published Jan 28, 2023, 5:36 PM IST
Highlights

ఏయూలోని శాతవాహన హాస్టల్ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐకి చెందిన కొందరు విద్యార్ధులు మోడీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ నేతలు , ఎస్ఎఫ్ఐ కార్యకర్తలకు వాగ్వాదానికి దిగారు. 

ప్రధాని నరేంద్ర మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. దీనిపై భారత్‌లోని బీజేపీ అనుకూల, వ్యతిరేక విద్యార్ధి సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్‌లోని హెచ్‌సీయూ, ఢిల్లీ యూనివర్సిటీలలో విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మోడీ డాక్యుమెంటరీని ఓ వర్గం విద్యార్ధులు ప్రదర్శిస్తుంటే.. దీనికి కౌంటర్‌గా ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఏబీవీపీ కార్యకర్తలు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇది ఆంధ్రా యూనివర్సిటీని కూడా తాకింది. 

శుక్రవారం రాత్రి ఏయూలోని శాతవాహన హాస్టల్ ప్రాంగణంలో ఎస్ఎఫ్ఐకి చెందిన కొందరు విద్యార్ధులు మోడీ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీకి చెందిన కొందరు విద్యార్ధులు అక్కడికి చేరుకుని ప్రదర్శన నిలిపివేయాల్సిందిగా డిమాండ్ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఏయూకి చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. 

ALso Read: మోడీపై బీబీసీ డాక్యుమెంటరీని బహిరంగంగా స్క్రీనింగ్ వేసిన కాంగ్రెస్.. కేరళలోని బీచ్‌లో నిర్వహణ

రెండ్రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్ధి సంఘాలు గురువారం ఆందోళనలు నిర్వహించాయి. కశ్మీర్ ఫైల్స్ సినిమాను ప్రదర్శించేందుకు ఏబీవీపీ ప్రయత్నించింది. దీనికి కౌంటర్‌గా మోడీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించేందుకు ఎస్ఎఫ్ఐ యత్నించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు విద్యార్ధి సంఘాలను అడ్డుకున్నారు. క్యాంపస్‌లో సినిమా ప్రదర్శనలకు అనుమతి లేదని పోలీసులు తేల్చిచెప్పారు. అనంతరం ఫిల్మ్ ప్రొజెక్టర్‌ను సీజ్ చేశారు. ఉద్రిక్తత నేపథ్యంలో హెచ్‌సీయూలో భారీగా పోలీసులు మోహరించారు. 

click me!