స్వరూపానంద పుట్టినరోజు వివాదం.. దేవాదాయశాఖ మెమోను సస్పెండ్ చేసిన హైకోర్టు

By Arun Kumar PFirst Published Nov 17, 2020, 1:07 PM IST
Highlights

విశాఖ శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు లో పిల్ దాఖలయ్యింది.

అమరావతి: ఈ నెల(నవంబర్) 18వ తేదీన విశాఖ శారదాపీఠం స్వామీజి స్వరూపానంద పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 23దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టు లో పిల్ దాఖలయ్యింది. ఈ పిల్ పై ఇవాళ(మంగళవారం) విచారించింది. ఈ సందర్భంగా తాము రాసిన లేఖ ను వెనెక్కి తీసుకుంటున్నామని  శారదా పీఠం తరపు న్యాయవాది తెలపగా... ప్రత్యేక మర్యాదలపై దేవాదాయశాఖ ఇచ్చిన మెమోను సస్పెండ్ చేసింది హైకోర్టు. 

ఇరు తెలుగు రాష్ట్రాల్లో విశాఖ శారదా పీఠాధిపతి గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తికాదు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ  సీఎం జగన్ ల వరుస భేటీలు ఆయనను రాష్ట్రంలో సెలెబ్రెటీగా మార్చాయి. పేరుకు ప్రైవేట్ పీఠాధిపతి అయినప్పటికీ... ఆయనకు ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం వేరే లెవెల్ లో ఉంటుంది. 

ఇటీవల శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి వారి జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలోని 23 ప్రధాన దేవాలయాలకు సంబంధించిన అర్చకులు ఆయన ముందు క్యూ కట్టాలని ప్రభుత్వం ఆదేశాలివ్వడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. నవంబర్ 18 నాడు నాగులచవితి నాడు విశాఖశారదాపీఠాధిపతి జన్మదినం జరుపుతున్నామని, ఇందుకుగాను రాష్ట్రంలోని 23 దేవాలయాలకు సంబంధించిన ఆలయ అధికారులు, అర్చకుల ద్వారా గౌరవ మర్యాదలు అందించాలని పీఠం మేనేజర్ ద్వారా దేవాదాయశాఖకు లేఖ వెళ్ళింది. 

ఆ లేఖకు వెంటనే స్పందించిన దేవాదాయశాఖ స్వామి వారికి ఆలయ మర్యాదలు చేయాలం టూ 23 ప్రముఖ దేవస్థానాలకు చకచకా ఆదేశాలు వెళ్లిపోయాయి. దీని ప్రకారం ఈనెల 18వ తేదీన సదరు ఆలయాల వేదపండితులు, పూజారులు, అధికారులు వారి వారి గుళ్లలోని ప్రసాదాలు, ఆలయ మర్యాదల ప్రకారం కానుకలతో విశాఖ చేరుకుంటారు. అక్కడ స్వరూపానందను ఘనంగా ఆశీర్వదించి... ఆయన ఆశీర్వాదాలు కూడా తీసుకుంటారు. ఇది దేవాదాయ శాఖ ఉత్తర్వుల పరమార్థం. 

అయితే ఇక్కడే ఒక తిరకాసు ఉంది. గత సంవత్సరం కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి చాతుర్మాస దీక్ష కోసం విజయవాడలో రెండు నెలలు బస చేశారు. దేవదాయ శాఖ కనీసం ఆయనను పట్టించుకోలేదు. ఒక్క ఆలయ అధికారి కూడా ఆయనను దర్శించుకోలేదు. సనాతన, సాధికార పీఠమైన కంచి పీఠాధిపతినే పట్టించుకోని దేవాదాయ శాఖ.. స్వయంప్రకటిత విశాఖ పీఠం ఎదుట ఆలయాల అర్చకులను క్యూలో నిలబెట్టడం ఏమిటని పలువురు భక్తులు, అర్చక వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. 

శారదాపీఠాధిపతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటినుండి కూడా కాస్త అధిక స్వామిభక్తిని చూపెడుతున్నట్టుగా వరుస సంఘటనలు నిరూపిస్తున్నాయి. ఆయన తిరుమలకు వచ్చినప్పుడు తొలిసారి అలిపిరి వద్దే స్వాగతం పలికితే.... రెండవసారి ఏకంగా తిరుపతి ఎయిర్ పోర్ట్ వద్దే స్వాగతం పలికి ఆయనను తోడ్కొని వచ్చారు. 

తిరుమల ఆలయ మర్యాదల ప్రకారం ప్రైవేటు పీఠాధిపతికి ఈ స్థాయి మర్యాదలు అవసరం లేదు, ఇంతకుముందు ఈ స్థాయిలో చేసిన ఉదాహరణలు కూడా లేవు. పీఠాధిపతులు రావడం, వారికి ఆలయం వద్ద స్వాగతం పలికి దర్శనం చూపించడం ఆనవాయితీ. కానీ ఇక్కడ అన్నిటికి భిన్నంగా సాగుతోంది ఈ స్వామిభక్తి. ఈ విషయం గురించి భక్తులు, అర్చకులు నోళ్లెళ్లబెడుతున్నారు. 
 


 

click me!