అంత తీరిక లేకుండా పనిచేస్తున్నారా? గాంధీ, తిలక్ కంటే గొప్పవారా?.. జవహర్ రెడ్డిపై హైకోర్టు సీరియస్...

By Bukka SumabalaFirst Published Jul 29, 2022, 7:57 AM IST
Highlights

మహాత్మాగాంధీ, బాలగంగాధర్ తిలక్ లాంటి వారికంటే గొప్పవారా? కోర్టుకు హాజరయ్యే తీరిక లేకుండా పనిచేస్తున్నారా? అంటూ సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పై హైకోర్టు మండిపడింది. 

అమరావతి : కోర్టు ధిక్కరణ కేసు విచారణకు గైర్హాజరైన సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సమావేశం ఉందనే కారణంతో గైర్హాజర్ అవుతారా? కోర్టు ముందు హాజరు అయ్యే సమయం లేదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశాలు ఉంటాయి?  సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రోజుకు ఎన్ని గంటలు సమావేశాలలో పాల్గొంటారు సీఎం పేషీ నుంచి వివరాలు తెప్పించి వాస్తవాలు తేల్చమంటారా? అని ప్రశ్నల వర్షం కురిపించింది. మహాత్మా గాంధీ, బాలగంగాధర్ తిలక్ తదితర మహోన్నత వ్యక్తులూ  న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను గౌరవించి కోర్టులో హాజరయ్యారు. వారికన్నా మీరు గొప్పవారా? అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.  

హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ  జవహర్ రెడ్డి  దాఖలు చేసిన  అఫిడవిట్ లో సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమై ఎన్నింటికి ముగుస్తుందనే కనీస వివరాలు లేవని తీవ్రంగా ఆక్షేపించింది. భవిష్యత్తులో కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని న్యాయస్థానం గుర్తిస్తే వివరణ తీసుకోకుండా నేరుగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరించింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించక పోతే ఏమీ కాదులే అనే భావనతో ఉండొద్దని హితవు పలికింది.  హైకోర్టు న్యాయమూర్తి Justice dvs somayajulu గురువారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. సీఎంవో ముఖ్య కార్యదర్శిగా జవహర్‌రెడ్డికి పూర్తి బాధ్యతలు..

కేసు నేపథ్యం  ఇది…
2005 మే నుంచి 2019 జూలై వరకు తన వేతన బకాయిలు రూ.10.59 లక్షలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కృష్ణమూర్తి అనే ఉద్యోగి హైకోర్టును ఆశ్రయించారు. బకాయిలు చెల్లించాలని నిరుడు నవంబర్లో న్యాయస్థానం ఆదేశించింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో కృష్ణమూర్తి కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.  జలవనరుల శాఖ అప్పటి ముఖ్య కార్యదర్శి కే జవహర్ రెడ్డి,  ఆర్థిక శాఖ  ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్,  ఏలూరు సర్కిల్ జలవనరుల శాఖ సూపరింటెండెంట్  ఇంజనీర్ ఆర్. శ్రీ రామకృష్ణ, మరో ఇద్దరు అధికారులు   పి. నాగార్జునరావు, పి సుబ్రహ్మణ్యేశ్వర రావు లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. 

ఇటీవల ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది ఈ నేపథ్యంలో శ్రీ రామకృష్ణ,  నాగార్జున రావు,  సుబ్రహ్మణ్యేశ్వర రావు  విచారణకు హాజరయ్యారు, వేతన బకాయిలు చెల్లించాలని తెలిపారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ హాజరు నుంచి మినహాయింపు పొందారు.  సమావేశం ఉందని పేర్కొంటూ విచారణ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

దీనిని పరిశీలించిన న్యాయమూర్తి సమావేశం ఎన్ని గంటలకు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుందో పేర్కొనలేదని  ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మీ వందల కోట్ల రూపాయల వ్యవహారం కాదని పేర్కొన్నారు పిటిషనర్కు వడ్డీతో చెల్లించాల్సిన వేతన బకాయిలు 12 లక్షల రూపాయలను ఇలాంటి విషయంలోనూ కోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులను అరెస్టు చేయాలని వారెంటు జారీ చేస్తూనే విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తే నా కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తున్నారు తప్ప మిగిలిన సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

click me!