
నరసరావుపేట: మా పూర్వీకుల నుండి వారసత్వంగా వస్తున్నఇంట్లో భారీ సొత్తుతో కూడిన లంకెబిందెలు (Hidden Treasures) వున్నాయి... దయచేసి పురావస్తు శాఖ (Department of Archeology) ద్వారా తవ్వకాలు జరిపించాలంటూ ఓ మహిళ ఏకంగా జిల్లా కలెక్టర్ నే కోరింది. గ్రీవెన్స్ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా కలెక్టర్ ను కారంపూడికి చెందిన ముస్లీం మహిళ ఇలా విచిత్రమైన ఫిర్యాదు అందించింది. గుప్తనిధుల కోసం రహస్యంగా అన్వేషిస్తూ సొంతం చేసుకోవాలనుకునే ఈ కాలంలో ఇలా లంకెబిందల వివరాలు ప్రభుత్వానికి తెలపడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
వివరాల్లోకి వెళితే... గుంటూరుకు చెందిన దిల్షాన్ బేగం పుట్టినూరు పల్నాడు జిల్లా కారంపూడి. ఈమె పుట్టింటివారికి పూర్వీకుల నుండి వారసత్వంగా వచ్చిన పురాతన భవంతి వుంది. ఈ ఇళ్లు కారంపూడిలోని కన్యకాపరమేశ్వరి దేవాలయం పక్కన గల బజారులో వుంది. ఈ ఇంట్లోనే తమ పూర్వీకులు భారీసొత్తుతో కూడిన లంకెబిందెలు దాచినట్లు తెలిసిందంటూ మహిళ పల్నాడు కలెక్టర్ కు తెలిపింది.
ప్రభత్వం చొరవ తీసుకుని తమ పురాతన భవనంలో తవ్వకాలకు పురావస్తు శాఖను ఆదేశించాలని సదరు మహిళ కోరింది. ఇలా చేస్తే భారీ సొత్తుతో కూడిన లంకెబిందెలు లభించే అవకాశాలున్నాయంటూ పల్నాడు కలెక్టర్ కు దిల్షాన్ బేగం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
ఇక ఈ పిర్యాదుపై స్పందించిన పల్నాడు కలెక్టర్ కారంపూడి తహసీల్దార్ ను విచారణకు ఆదేశించినట్లు సమాచారం. మహిళ తెలిపిన వివరాల్లో నిజానిజాలు తెలుసుకుని పూర్తి వివరాలు అందించాలని కలెక్టర్ నుండి ఆదేశాలు అందాయని ఎంఆర్వో ప్రసాదరావు తెలిపారు.
ఇదిలావుంటే గతేడాది తెలంగాణ జనగామ జిల్లాలో ఓ రైతు పొలంలో లంకెబిందెలు లభించాయి. పెంబర్తి గ్రామంలో ఓ రైతు పొలంలో బంగారంతో నిండివున్న బిందె లభ్యమయ్యింది. హైద్రాబాద్ కు చెందిన నర్సింహ అనే వ్యక్తి పెంబర్తి గ్రామ సమీపంలో వరంగల్-హైద్రాబాద్ జాతీయ రహదారికి సమీపంలో 11 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఈ భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించాలని ఆయన ప్లాన్ చేశాడు. దీనికి గాను ఆయన ఈ భూమిని జేసీబీతో చదును చేస్తుండగా లంకె బిందె (బంగారంతో ఉన్న బిందె) కన్పించింది.
దీంతో వెంటనే ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ బిందెను తెరిచి చూస్తే 17 తులాల బంగారం, 10 కిలోల వెండి లభ్యమైంది. ఈ సొత్తును అధికారులను స్వాధీనం చేసుకున్నారు.