హెరిటేజ్ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్య

By Siva KodatiFirst Published Feb 11, 2019, 12:18 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం ఆధ్వర్యంలో నడుస్తున్న హెరిటేజ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ డిస్ట్రిబ్యూటర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరానికి చెందిన గంగినేని హరిబాబు 2012లో హెరిటేజ్‌‌కు చెందిన పాలు, కూరగాయాలు ఇతర పదార్ధాల విభాగంలో కారీయింగ్ అండ్ ఫార్వార్డిండ్‌ విభాగంగలో డిస్ట్రిబ్యూటర్‌గా చేరాడు.

ఆ సమయంలో కంపెనీ నియమ నిబంధనలను అనుసరించి రూ.2.8 లక్షలు కూడా డిపాజిట్ చేశాడు. ఒంగోలులో నివసిస్తున్న ఆయన తనకు కంపెనీ సరఫరా చేస్తున్న పాలు, ఇతర పదార్థాలను ఏజెంట్లకు సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో అదనంగా డిపాజిట్ చెల్లించకపోవడం తదితర కారణాలతో పాలు, పదార్థాల సరఫరా నిలిపివేస్తున్నట్లు హరిబాబుకు హెరిటేజ్ నుంచి జనవరి 5న మెయిల్ అందింది.

ఈ విషయాన్ని కంపెనీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లాడు. అంతేకాకుండా నారా భువనేశ్వరి, బ్రాహ్మణీలకు లేఖ కూడా రాశాడు. తనకు పదార్థాల సరఫరా నిలిపివేస్తే ఆర్ధికంగా ఇబ్బందిపడతానని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతర కంపెనీల కన్నా తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నా, కేవలం తెలుగుదేశం పార్టీపై అభిమానంతోనే పనిచేస్తున్నట్లు వాపోయాడు.

ఈ లేఖకు హెరిటేజ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన హరిబాబు శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అర్థాంతరంగా డిస్ట్రిబ్యూటర్‌గా తప్పించడంతో అప్పుల పాలవ్వడంతో పొలాన్ని అమ్మి అప్పు తీర్చాడు.

శనివారం స్వగ్రామానికి చేరుకున్న హరిబాబు ఆదివారం ఉదయం అచేతనంగా పడివున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను అద్దంకిలోని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే హరిబాబు మరణించినట్లు వైద్యులు నిర్థారించారు.

హెరిటేజ్ నుంచి తొలగించడం, బకాయిలు రాకపోవడంతో బయట ముఖం చూపించలేకపోతున్నాని, తనకు ఆత్మహత్యే శరణ్యమని హరిబాబు సూసైడ్ నోట్‌లో రాశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. 

click me!