
అమరావతి: అసని తీవ్ర తుఫాన్ మరికొన్ని గంటల్లో కోస్తాంధ్ర తీరం దాటనుంది. భీకర గాలులతో వర్షం దంచికొట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పటికే రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. కాగా, తీర ప్రాంత మండలాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
కాకినాడ, విశాఖ పోర్టుల్లో గ్రేట్ డేంజర్ సిగ్నల్ 10 జారీ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు రెడ్ సిగ్నల్ జారీ అయింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అసని తుఫాన్ కోస్తాంధ్ర తీరానికి వచ్చిన తర్వాత వాయవ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. కాకినాడ తీరానికి వచ్చిన తర్వాత దిశను మార్చుకుంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ నేపథ్యంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతల్లో ఉండకూడదని, పాత భవనాల్లోనూ ఉండరాదని సూచనలు చేశారు. తుఫాన్ రానున్న నేపథ్యంలో ప్రజలు జాగరూకతగా ఉండాలని కోరారు.
మచిలీపట్నం వద్ద తీరం తాకనున్న అసని తుఫాన్.. మళ్లీ విశాఖ వద్ద సముద్రంలోకి ప్రవేశిస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రభావంత కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తీరాన్ని దాటిన తర్వాత తుఫాన్ బలహీన పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ తీరానికి 210 కి.మీ, విశాఖపట్నంకు 310 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది. తీరానికి దగ్గరగా వస్తున్న సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుఫాన్ తీరం దాటే సమయంలో మరింత వేగంగా గంటకు 90 కి.మీకు పైగా వేగంతో ఈదరుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇప్పటికే కోస్తాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వర్షాలు కురుస్తున్నాయి. తీరప్రాంతాల్లో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈదురుగాలులకు పలుచోట్ల వృక్షాలు నెలకొరిగాయి. కొన్నిచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడంతో ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాలతో రైతులు పంటలు కాపాడుకోవడంపై దృష్టి సారించారు.