
అమరావతి: ఇరు తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహించడంతో పాటు నీటి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఈ వరద నీటితో కృష్ణా నది ప్రమాదకరంగా ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వస్తుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ ఇన్ ఫ్లో 6,02,245క్యూసెక్కులుగా వుండగా వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపిస్తున్నారు. దీంతో ఔట్ కూడా అంతే వుంది. వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం వుందని... కాబట్టి ముందస్తుగా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని పరివాహక ప్రాంత ప్రజలకు విపత్తులశాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత , లంకగ్రామల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నంలో భాగంగా మైకు, సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు. ఎక్కడిక్కడి ఈ సమాచారం ప్రజలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. నదికి సమీపంలో ఉండటం అతి ప్రమాదకరమని... వెంటనే పునరావస కేంద్రాలకు బాధితులందరికీ తరలించాలని సూచించారు. ప్రజలు వాగులు, వంకలు, కాల్వలు దాటే ప్రయత్నం చేయవద్దని కన్నబాబు సూచించారు.
పులిచింతల నుండి దిగువకు భారీ వరదనీరు కిందకు వదులుతున్నారు. ఇరవైగేట్ల ద్వారా 6,50,000 క్యూసెక్కులు వరదనీటిని కిందకు విడుదల చేస్తున్నారు. పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. గ్రామాలలో వందల ఎకరాలలో పంటలు నీట మునిగాయి. అచ్చంపేట మండలం జడపల్లి తండా,కంచుబోడు తండాలను వరదనీరు చుట్టుముట్టింది.
తాడువాయి ప్రధాన రహదారిపై వరదనీరు చేరడంతో అచ్చంపేట-మాదిపాడు రాకపోకలు బందయ్యాయి. కోనూరు పంటపొలాలలో ఆరు అడుగుల మేర నీరు నిలిచింది. అమరావతి అమరేశ్వర స్నానఘట్టాలు దాటి వరదనీరు ప్రవహిస్తోంది.