రానున్న నాలుగైదు గంటల్లో... ఏపీలో భారీ వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

By Arun Kumar PFirst Published Nov 12, 2020, 9:51 AM IST
Highlights

గురువారం ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ  భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి ప్రకటించినట్లు ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. 

అమరావతి: రాగల నాలుగైదు గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అక్కడక్కడ  భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండి ప్రకటించినట్లు ఏపీ విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. కాబట్టి రాష్ట్ర ప్రజలు, అధికారులు అప్రమత్తంగా వుండాలని ఆయన సూచించారు. 

ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే శ్రీకాకుళం,  విజయనగరం, విశాఖ,  తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో  తేలికపాటి నుంచి మోస్తరు  వర్షాలు పడే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా వున్నట్లు కన్నబాబు వెల్లడించారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని నదులు, కాలువలు, వాగులు వరద నీటితో ప్రమాదకర రీతిలో వరద నీటితో ప్రవహించాయి. అంతేకాకుండా నీటి పారుదల ప్రాజెక్టులు, చెరువులు నిండుకుండల్లా మారాయి. ముఖ్యంగా కృష్ణానది ప్రమాదకర రీతిలో ప్రవహించి ఆందోళనను కలిగించింది. అయితే వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎలాంటి ప్రమాదం చోటుచేసుకోలేదు. 

వర్షాల కారణంగా చేతికొచ్చిన పంట నీటమునిగి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఇలా ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగించగా మళ్లీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికలు రైతుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. 

click me!